తిరుపతి ఎడ్యుకేషన్ : మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాల ద్వారా విద్యాప్రమాణాలు మరింత మెరుగుపడుతాయని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని ఎస్పీజేఎన్‌ఎం హైస్కూల్లో శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మెగా పీటీఎం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,550 పాఠశాలల్లో సుమారు 1.52 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మెగా పీటీఎంను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది పాఠశాలల్లో మౌలిక వసతుల పెంపునకు డోనర్ యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, డీఈఓ కేవీఎన్.కుమార్, తిరుపతి అర్బన్ ఎంఈఓలు బాలాజీ, భాస్కర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సగం వేతనం విరాళం
తన ఒక నెల వేతనంలో సగం మొత్తాన్ని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు విరాళంగా అందించారు. తిరుపతిలోని ఎస్పీజేఎన్‌ఎం పాఠశాలలో నిర్వహించిన పీటీఎంలో డోనర్ యాప్ ఉపయోగాన్ని వివరించారు. అనంతరం నగం వేతనం మొత్తాన్ని ఈ యాప్ ద్వారా అందించారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రూ.50 వేలు, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, రూ.50 వేలు, డీఈఓ రూ.20 వేలు, అలాగే తల్లిదండ్రులు తమ విరాళాలను స్వచ్ఛందంగా డోనర్ యాప్ ద్వారా అందించారు.


