వరదయ్యపాళెం: వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కుటుంబానికి చెందిన భూములకు వేసిన ప్రహరీ గోడను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే విధ్వంసం చేయడం రాజకీయ కక్షలో భాగమేనని వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ స్పష్టం చేశారు. ఈ పరిణామాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 23 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి వారి అనుభవంలో ఉన్న భూములను కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం చంద్రబాబు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతును అణచివేసేందుకు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌బాబు పూనుకున్నారని దుయ్యబట్టారు. సరికొత్త సంప్రదాయానికి ఒడిగడుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లో ఉన్నాయని ఆయన హితవు పలికారు.


