తిరుపతి అర్బన్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థల(ఐటీఐ)లో రెండో దశ ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ కన్వీనర్ గణేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు సంబంధించి ఐటీఐఏడీఎంఐఎస్‌ఎస్‌ఐఓఎన్‌ఎస్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉందని, అభ్యర్థులు ఏ ఐటీఐలో చేరదలచుకున్నారో ఆ ఐటీఐలో ఆప్షన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సర్టిఫికేట్ వెరిపికేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు 6న, ప్రైవేటు ఐటీఐలో ఆగస్టు 8న ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. అదనపు సమాచారం కోసం 9492861369, 8500021856, 9441647174, 9533717170 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
కోడలి నుంచి ప్రాణహాని!
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి – రేణిగుంట మార్గంలో సుమారు 15 ఏళ్ల క్రితం తన కుమారుడు చనిపోయాడని, దీనికి సంబంధించి తమ కోడలికి శిక్ష పడిందని, ఆమె నుంచి ఇప్పుడు ప్రాణహాని ఉందని చంద్రగిరి నియోజకవర్గం, నర్సింగాపురం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు నిరంజన్‌శెట్టి, శ్యామల ఆవేదన వక్తం చేశారు. గురువారం వారు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. తమ కుమారుడు సంపాదించిన నగదు, నట్రా వ్యవహారం కోర్టులో నడుస్తోందన్నారు. దీనిపై పరిణామాలు ఎలా ఉంటాయో తెలియడం లేదన్నారు. ప్రస్తుతం తమ జీవన పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. మరోవైపు పొంచి ఉన్న ప్రాణహాని నుంచి కాపాడి కోడలి వద్ద నుంచి తమకు చెందాల్సిన నగదు, బంగారు అప్పగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
31న ఖాళీ గోనె సంచుల ఈ–వేలం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన ఖాళీ గోనె సంచులను ఈ నెల 31న ఈ–వేలం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ‘రేట్ కాంట్రాక్ట్‘ ప్రాతిపదికన విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనే వ్యక్తులు, సంస్థలు ఈ నెల 30వ తేదీ సాయంత్రంలోపు కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.30 వేలు ఈఎండీ చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ కొనుగోలు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అదనపు సమాచారం కోసం టీటీడీ జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని 0877–2264429 ఫోన్ నంబర్ సంప్రదించాలని టీటీడీ పేర్కొంది.
26న జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సీడీసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 26న అండర్–14 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆ మేరకు సీడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసమూర్తి, సతీష్‌యాదవ్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, వాయల్పాడు, చిత్తూరులో ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. తిరుపతి డివిజన్‌కు సంబంధించి మంగళం రోడ్డులోని సీవీ క్రికెట్ అకాడమీలో, మదనపల్లి డివిజన్‌కు సంబంధించి వాయల్పాడులోని జీవీఎస్‌ఈఎస్ మైదానం, చిత్తూరు డివిజన్‌కు సంబంధించి చిత్తూరులోని పోలీస్ గ్రౌండ్‌లో ఈ ఎంపిక ఉంటుందని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే క్రీడాకారులు 01–09–2012 – 31–08–2014 లోపు జన్మించిన వారు అర్హులని, ఆసక్తి ఉన్న వారు ఆయా డివిజన్ల పరిధిలో నిర్వహించే ఎంపికలో ఉదయం 8గంటలకు హాజరవ్వాలని తెలిపారు. అలాగే తెల్లని దుస్తులు, సొంత క్రీడా సామగ్రి, ఆధారు కార్డు, బర్త్ సర్టిఫికెట్ పత్రాలను వెంట తీసుకురావాలని కోరారు. మరిన్ని వివరాలకు 88861 85559, 98665 04500, 90002 14966నంబర్లలో సంప్రదించాలని వారు సూచించారు.
అమేజాన్ కంపెనీ బస్సు బోల్తా
– తృటిలో తప్పిన పెను ప్రమాదం
నాగలాపురం: అమేజాన్ కంపినీకి వెళ్తున్న బస్సు పొలంలోకి బోల్తా పడిన ఘటన మండలంలోని మలిమేలుకండ్రిగ గ్రామంలో బుధవారం రాత్రి 11.30 ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. తమిళనాడు పుదువాయిల్‌లోని అమేజాన్ కంపినీకి చెందిన బస్సు నాగలాపురంలో ఉద్యోగులను దింపి, తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యంలోని మలిమేలుకండ్రిగ వద్ద బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో ఉద్యోగుల ఎవరూ లేకపోవడం ప్రాణనష్టం తప్పింది. డ్రైవర్ నిద్ర మత్తులోనే బస్సు పొలంలోకి దూసుకెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సునీల్ తెలిపారు.


