అక్టోబర్ 15 వరకు నిషేధం ఉన్నా
లెక్కచేయని కూటమి నేతలు
కళ్లప్పగించి చూస్తున్న అధికారులు
కలువాయి(సైదాపురం): కలువాయి మండలం, రాజుపాళెం సమీపంలోని పెన్నా నదిలో కూటమి నాయకులు బరితెగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దర్జాగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో మనుషులు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించాలని నిబంధన కున్నా పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా భారీ ప్రొకై ్లనర్లు పెట్టి వందల టిప్పర్లతో ఇసుకను తోడేస్తున్నారు. రాజుపాళెం నుంచి వెంకటరెడ్డిపల్లి వద్ద ఉన్న వంతెన వరకు దాదాపు 4 కి.మీ వరకు వరకు పెన్నా నదిలోనే రోడ్డు నిర్మించారు. వాల్టా చట్టం నిబంధనలు అతిక్రమించి మరీ తవ్వకాలు సాగిస్తున్నారు. పెన్నాలోకి వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాజుపాళెంలో రోజుకు వందల లారీల ఇసుక తరలిస్తున్నారు. తెలిసినా ఇటువైపు ఏ ఒక్క అధికారీ కన్నెత్తి చూడడం లేదు. ఇసుక లారీల కారణంగా ప్రధాన రహదారులు గుంతలమయంగా మారినా పట్టించుకోవడం లేదు. హైవేపై భారీ టిప్పర్లు వెళ్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారు తప్ప అడ్డంగించేందుకు సాహసం చేయడం లేదు. ఇవేవీ అధికారులకు కనిపించడం లేదా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
పర్యావరణానికి ముప్పు
ఇటీవల కుల్లూరు హైవే పక్కన ఇసుక డపింగ్ యార్డ్‌ను అనధికారికంగా ఏర్పాటు చేశారు. పెన్నాలోకి అడ్డంగా రహదారి నిర్మించడం వల్ల నది వారధి వెంబడి పంటలు వేసిన రైతులకు నీరందని పరిస్థితి నెలకొంది. ఇసుక అక్రమ రవాణాపై ఇటీవల వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆ పార్టీ నేతలతో కలిసి తెలుగురాయపురం అక్రమ రీచ్‌లో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన చెందారు. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ ఇంతవరకు చర్యలు లేవు.
పెన్నా నదిలోకి అక్రమార్కులు ఏర్పాటు చేసిన బాట
నిషేధం ఉన్నా..
జూన్ 1 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు పెన్నాలో ఇసుక తవ్వకాలు నిషేధం విధించారు. అయితే కూటమి నేతలు స్టాక్ పాయింట్ అని పేరు చూపించి నేరుగా పెన్నాలోనే భారీ యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. యథేచ్ఛగా టిప్పర్ల సాయంతో తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఇంతజరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు సైతం స్పందించకపోవడం గమనార్హం.
పెన్నా నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు


