రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ప్రయివేటు పరం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ప్రయివేటు పరం

Jul 24 2026 1:51 AM | Updated on Jul 24 2026 1:51 AM

● ధ్వజమెత్తిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

పుల్లంపేట: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రైవేటు రాష్ట్రంగా మార్చేస్తోందని మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం మండల పరిషత్‌ అధ్యక్షుడు ముద్దా.బాబుల్‌రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన ఆయన కాసేపు సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ప్రైవేటుపరం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టుందని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థుల చదువులతో పాటు పేదల వైద్యం కోసం వేలకోట్లు ఖర్చు చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్‌ కళాశాలలను నిర్మిస్తే ఆయా కళాశాలలను ప్రైవేటుపరం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని పది ఆర్టీసీ బస్టాండ్లను ప్రైవేటుపరం చేశారని చెప్పారు. బ్రిటీష్‌ హయాంలో 1907లో ఏర్పడిన రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను ప్రైవేటు పరం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయన్నారు. రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను ప్రైవేటుపరం చేయడం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆస్తులను తన వారికి దోచిపెట్టడానికే వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్మించిన పోర్టులు, ఫిష్షింగ్‌ హార్బర్లను సైతం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగినా మహిళగా ఉన్న హోంమంత్రి స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రానికి 28 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, 23 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.6 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని, అందులో కొన్ని ఇప్పటి వరకూ చాలాభాగం నిధులు గ్రౌండింగ్‌ కాలేదని కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటన విడుదల చేసిందని గుర్తుచేశారు. నిత్యం అబద్ధాలు, మోసాలు, కుట్రలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్ల హామీలు ఇంతవరకు నెరవేరలేదని చెప్పారు. ఆయన వెంట రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి.అమరనాథరెడ్డి, మాజీ శాసనసభ్యుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, మాజీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి, రాయచోటి మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ సయ్యద్‌ ముస్టాక్‌, జెడ్పీటీసీ సభ్యులు రామనాథం, సీనియర్‌ నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి, రంజిత్‌రెడ్డి, తల్లెం.భరత్‌కుమార్‌రెడ్డి, నళినీరెడ్డి, రంగారెడ్డి, రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement