శ్రీకాళహస్తి: జల్సాలకు అలవాటు పడి వరు చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడితోపాటు ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం.. పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో జూలై 7వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటి గ్రిల్స్, ప్రధాన ద్వారాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం బీరువాలో ఉన్న బంగారు నగలను అపహరించి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి వన్‌టౌన్ పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వన్ టౌన్ సీఐ సి.వెంకటేష్ ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. జూలై 22న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాలాయపల్లె మండలం, వెంగమాంబాపురానికి చెందిన అక్కుర్తి నవీన్ అలియాస్ లవ్‌లీ (26), తిరుపతికి చెందిన డేరంగుల జగదీష్ (25) ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితులపై తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు దొంగతనాల కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. నవీన్‌్‌పై 24, జగదీష్‌పై 8 పాత కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 8 గ్రాముల బంగారు గొలుసు, 4 గ్రాముల బరువు గల ఒక జత బంగారు కమ్మలు, చోరీకి వినియోగించిన ఆటో, రెండు ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ.1.2 లక్షలు ఉంటుందన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన వన్‌టౌన్ సీఐ వెంకటేష్, ఎస్‌ఐలు రామకృష్ణ, స్వాతి, ఏఎస్‌ఐలు ఆనందయ్య, గంగయ్య, పోలీసు సిబ్బంది శంకరయ్య, భానుతేజతో పాటు కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, డీఎస్పీ నరసింహమూర్తి అభినందించారు.


