తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులు అంతర్జాతీయ వేదికపై ప్రతిభ కనబరిచారు. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పి.హరిణిసూర్యం, ఫార్మా స్యూటికల్ సైన్సెస్ విభాగానికి చెందిన జి.శ్రీసాయి హర్షిత థాయ్‌లాండ్‌లోని ప్రిన్స్ ఆఫ్ సాంగ్‌క్లా యూనివర్సిటీ (పీఎస్‌యూ), పట్టానీ క్యాంపస్ నిర్వహించిన ఐదు రోజుల ‘లీడర్‌షిప్ ఫర్ సస్టయినబుల్ డెవలప్‌మెంట్’ అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విశ్వ విద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. భారత్, మలేషియా, ఫిలిప్పిన్స్, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన విద్యార్థులతో కలిసి పాల్గొన్న వీరు నాయకత్వ లక్షణాలు, బృంద సహకారం, భిన్న సంస్కృతుల అవగాహనతో పాటు ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీలు)పై అనుభవాత్మక శిక్షణ పొందారు. కార్యక్రమంలో భాగంగా పట్టానీ ప్రాంతంలోని సాంస్కృతిక, వ్యవసాయ కేంద్రాలను సందర్శించి సుస్థిర వ్యవసాయ విధానాలు, పశుపోషణ పద్ధతులను అధ్యయనం చేశారు. అనంతరం ఎస్‌డీజీ–1 (పేదరిక నిర్మూలన) అంశంపై వివిధ దేశాల విద్యార్థులతో కలిసి చర్చించి తమ ఆలోచనలను పంచుకున్నారు. విద్యార్థినుల ప్రతిభను ఎస్‌పీఎంవీవీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఉమా వెన్నం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉషా, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి అభినందించారు.


