ఆరోగ్యశాఖలో | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశాఖలో

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

ప్రైవేటు ఆస్పత్రులు, ఎక్స్‌రే, స్కానింగ్‌ సెంటర్ల అనుమతులకు రేటు ● రెన్యువల్‌ కోసం మరో రేటు.. డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారిదే పెత్తనం ● వసూళ్ల కోసం మరి కొందరిని డిప్యుటేషన్‌పై తెచ్చుకుని చక్రం తిప్పుతున్న వైనం ● మరో వైపు శారీరక కోరికలు తీర్చుకునేందుకు మహిళా సిబ్బందికి వేధింపులు ● వైద్య ఆరోగ్యశాఖలో అరాచకాలు బయటపడడంతో తన వారితో ప్రత్యేక కమిటీ ● కమిటీ నుంచి అనుకూల నివేదిక కోసం మళ్లీ మళ్లీ మార్పులు చేయాలని హుకుం ● తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్‌ అధికారుల ఇష్టారాజ్యం

ప్రతి పనికీ సపరేటు టీం.. అడిగినంత ఇవ్వాల్సిందే

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని కామవాంఛ తీర్చాలని వేధింపులకు గురిచేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళా ఉద్యోగినికి ఎదురైన ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్న విషయం వెలుగులోకి రావడంతో కార్యాలయంలోని కొందరు ‘పిశాచాల’ బాగో తం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ ఒక్క మహిళా ఉద్యోగి కాకుండా మరింత మంది బాధితులు ఉన్నారనే ప్రచారం గుప్పుమంటోంది.

అంతా వారి కనుసన్నల్లోనే..

పక్క జిల్లా నుంచి డిప్యుటేషన్‌పై తిరుపతికి వచ్చిన ఓ అధికారి తన అనుచరుల ద్వారా వైద్యశాఖ కార్యాలయాన్ని శాసిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కార్యాలయంలో తన పట్టును, పలుకుబడిని పెంచుకునేందుకు, వసూళ్ల కోసం కొన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనిచేసే యూడీసీలను ఎంపిక చేసుకున్నారు. తాను చెప్పినట్టు నడుచుకునే వారిని జిల్లా కార్యాలయానికి డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో సెక్షన్‌ బాధ్యత అప్పగించారు. ప్రైవేటు ఆస్పత్రుల అనుమతులు, రెన్యువల్‌ కోసం ఒకరిని, ఎక్స్‌రే, స్కానింగ్‌ సెంటర్ల అనుమతులు, రెన్యువల్స్‌ కోసం మరొకరికి బాధ్యతలు అప్పగించారు. ఇంకా బదిలీలు, డిప్యుటేషన్లు, బిల్లుల మంజూరు వంటి కార్యకలాపాలకు ఒక్కొక్కరికీ బాధ్యతలు అప్పగించారు. అనుమతులు, రెన్యువల్స్‌ చేయాలంటే రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వాయిస్‌ రికార్డులు బయటకు వచ్చాయి. ఇటీవల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ రోగికి సర్జరీ చేస్తుండగా మరణించాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆ ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ అనుమతులు రద్దుచేశారు. అదే ఆస్పత్రికి తిరిగి అనుమతులు తెప్పించేందుకు నగదు చేతులు మారడంతో.. అందుకు సంబంధించిన ఫైల్‌ చకచకా కదులుతున్నట్లు సమాచారం.

డిప్యుటేషన్‌పై తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తిష్టవేసిన కొందరు అధికారులు తమను అడిగేవారు లేరన్నట్టు రెచ్చిపోతున్నారు. చేయి తడిపతే నిబంధనలన్నీ పక్కనపెట్టి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు, రెన్యువల్స్‌ చేసేస్తున్నారు. ఎక్స్‌రే, స్కానింగ్‌ సెంటర్లకు కూడా ఎడాఎడా అనుమతులిచ్చి జేబులు నింపుకుంటున్నారు. మరో వైపు శారీరక వాంఛలు తీర్చుకునేందుకు మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమకు అనుకూలంగా ఉన్న వారితో కమిటీ ఏర్పాటు చేసి.. నివేదికలు సిద్ధం చేసేపనిలో నిమగ్నమయ్యారు. ఆరోగ్యశాఖలో ‘పిశాచాల’ తీరుపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌..

ఆ సంఘానికే ఎందుకు అంత ప్రాధాన్యత

కామవాంఛ తీర్చాలని అధికారులు తనను వేధింపులకు గురి చేశారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి కన్నీటి పర్యంతమవుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్పందించిన అధికారి ఆరుగురు వైద్యశాఖ అధికారులతోనే ఓ కమిటీని ఏర్పాటు చేశారు. బాధిత మహిళను మభ్యపెట్టేందుకే ఆ కమిటీని ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే.. ఆ కమిటీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులే అంతా. ఆ కమిటీలో మరేశాఖ అధికారులు లేకపోవడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అధికారపార్టీ (తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘం) పేరుతో ఏర్పాటు చేసుకున్న సంఘంలోని కీలక ఉద్యోగులు అందులో ఉన్నారు. వీరు.. కామ వాంఛను తీర్చాలి అన్న అధికారికి మద్దతుగా.. అనుకూలంగా రిపోర్టు రాసేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను అనుకూలంగా రాసేందుకు ఓ రిటైర్డ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారిని పిలిపించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కార్యాలయంలో కొంత మంది ఉద్యోగులు నిద్రించినప్పుడు సీసీ కెమెరాలు ఆపేసిన వారికి మెమోలు ఇచ్చి వదిలేయడంపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న అవినీతి, మహిళా ఉద్యోగినులపై వేధింపులపై సమగ్ర విచారణ జరిపి ‘పిశాచాల’పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మహిళా ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement