● వందలాది మంది పోలీసులతో ముట్టడి ● రక్షణ గోడ కూల్చివేత ● ఎవ్వరినీ రానీయకుండా అడ్డగింత ● టీడీపీ అనుకూల మీడియాకు అనుమతి ● కట్టుకథలతో భూమనను భూ కబ్జదారుగా చిత్రీకరించే ప్రయత్నం ● పోలీసుల కుఠిలత్వంపై మండిపడ్డ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు
కబ్జాకోరులుగా
చిత్రీకరించడానికేనా?
భూమన కుటుంబాన్ని భూ కబ్జాదారుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు, పచ్చ మీడియాను రంగంలోకి దించినట్టు తిరుపతి నగర వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు మల్లం రవి ఆరోపించారు. పచ్చ మీడియాతో పాటు ఆ భూమితో సంబంధం లేని వ్యక్తులను ఎలా అనుమతిస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజకీయ కక్ష సాధింపుతో వ్యవసాయ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని భూమన కుటుంబంపై అబాండాలు వేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. దీంతో పోలీసులు, వైఎస్‌ఆర్‌సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడవగా.. కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, తనపల్లి సమీపంలో టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని పోలీసు బలగాలతో అష్టదిగ్బంధనం చేశారు. గురువారం తెల్లవారు జాము నుంచే వందలాది మంది పోలీసులు వ్యవసాయ క్షేత్రాన్ని చుట్టుముట్టారు. వ్యవసాయ క్షేత్రంలోకి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, సాధారణ ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులను కూడా అనుమతించకుండా అడ్డుకున్నారు. భూమన వ్యవసాయ క్షేత్రానికి ఆనుకుని ప్రవహించే స్వర్ణముఖి నది వద్ద పొలాలకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న రక్షణ గోడను రెవెన్యూ అధికారులు తొలగించారు. భారీ యంత్రాలను రంగంలోకి దించి పునాదులను సైతం పెకళించారు. వ్యవసాయ భూమికి రక్షణగా ఏర్పాటు చేసుకున్న రక్షణ గోడను పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా ప్రతినిధులకు మాత్రం పోలీసులు వ్యవసాయ క్షేత్రం లోపలికి అనుమతిచ్చి రక్షణ గోడను కూల్చివేసే దృశ్యాల చిత్రీకరణకు అవకాశం కల్పించారు. పోలీసులు తాము ఎవ్వరినీ లోపలకు పంపలేదని వాదనకు దిగడంతో లోపల జరిగే విధ్వంసకర చర్యలను పచ్చ మీడియా తన కట్టుకథలతో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు చూపారు.
కక్ష సాధింపులకు నిదర్శనమిది
వ్యవసాయ క్షేత్రం వద్ద సాధారణ మీడియాను అడ్డుకున్న పోలీసులు, టీడీపీ అనుకూల మీడియాను మాత్రం గుట్టుగా లోపలికి వెళ్లడానికి అనుమతించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. ముందే సిద్ధం చేసిన కథనాలకు అనుగుణంగా అక్కడ పునాదుల తవ్వకాల లైవ్ వీడియోలు చిత్రీకరణ జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోందని విమర్శించారు. వందలాది మంది పోలీసులను మోహరించి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని చుట్టుముట్టడం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ కక్షలకు అద్దం పడుతోందని, ప్రతిపక్ష నేతలను భయపెట్టడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.


