తిరుమలలో మరో వివాదం | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో మరో వివాదం

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

● నడక మార్గంలో ‘పెద్ది’ సినిమా పోస్టర్‌తో మహిళ హల్‌చల్‌

తిరుమల: శ్రీవారి క్షేత్రంలో రాజకీయ, సినిమా, వాణిజ్య ప్రచారాలపై నిషేధం అమలులో ఉంది. ఒక మహిళ పెద్ది సినిమా పోస్టర్‌ను పట్టుకుని అలిపిరి నడకమార్గంలో పాదయాత్ర చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై అధికారికంగా స్పష్టత లేదు. వైరల్‌ అవుతున్న చిత్రాల్లో మహిళ చేతిలో భారీ ‘పెద్ది’ సినిమా పోస్టర్‌ను పట్టుకుని అలిపిరి నడకమార్గంలో కనిపించింది. అలాగే మోకాళ్ల పర్వతం గోపురం సమీపంలో పోస్టర్‌తో ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో సినిమా, రాజకీయ లేదా వాణిజ్య ప్రచారాలకు టీటీడీ అనుమతి ఇవ్వదు. ఇలాంటి నిషేధాలు అమలులో ఉన్నప్పటికీ పోస్టర్‌తో నడకమార్గంలో పాదయాత్ర చేయడం ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఇంత పెద్ద పోస్టర్‌తో మహిళ నడిచినా భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై టీటీడీ లేదా విజిలెన్స్‌ విభాగం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఘటన జరిగిన తేదీ, మహిళ వివరాలు, ఆమె పోస్టర్‌తో నడకమార్గంలోకి ఎలా ప్రవేశించిందనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు, వీడియోల ఆధారంగానే ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement