రేణిగుంట: మండలంలోని కరకంబాడి సమీపంలో ఉన్న రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం కోకా కోలా ఇండియా ఫౌండేషన్ సహకారంతో జాతీయ మామిడి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావ్, రాస్ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటరత్నం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరు రైతులు, అధికారులు చేపట్టిన వ్యవసాయ ప్రదర్శనను సందర్శించారు. జేసీ మాట్లాడుతూ కోకాకోలా ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఉన్నతి మ్యాంగో పథకం ద్వారా జిల్లాలోని రైతుల ఆదాయం పెంచడానికి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. విదేశాలకు ఎగుమతి అయ్యేలా మామిడి ఉత్పత్తులను తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ శ్రీనివాసులు, ఉద్యాన శాస్త్రవేత్త సుధాకర్, జిల్లా ఉద్యాన అధికారి జయభరత్‌రెడ్డి, రాష్ట్ర సామాజిక ప్రకృతి వ్యవసాయ పథకం సంచాలకులు షణ్ముగం, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.


