మత్స్యకారుల సమస్యపై సమావేశం వాయిదా | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల సమస్యపై సమావేశం వాయిదా

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

తడ: పులికాట్‌ సరస్సులో చేపల వేటపై ఆంధ్ర, తమిళనాడు జాలర్ల మధ్య తరచూ ఘర్షణ జరుగుతోంది. ఈ వివాదాల పరిష్కారం కోసం ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు జిల్లాలఽ ఉన్నతాధికారులు గురువారం తడలో నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ చొరవతో తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌, ఎస్‌పీ, తిరుపతి జిల్లా ఎస్‌పీ, ఇతర ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టారు. దీనికి తిరువళ్లూరు అధికారులు సమ్మతించారు. బుధవారం సాయంత్రం తమిళనాడులో అత్యవసర సమావేశం ఉండడంతో అధికారులు రావడం లేదన్న సమాచారం అందజేశారు. దీంతో సమావేశం వాయిదా పడినట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. గతంలో జరిగిన గొడవలకు సంబందించిన కేసులో ఆంధ్రా పరిధిలోని మత్స్యకారులు పదేళ్లుగా తిరువళ్లూరు కోర్టుకు తిరుగుతున్నారు. ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగితే తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కారమవుతాయని ఎదురు చూసిన జాలర్లకు నిరాశ ఎదురైంది.

చోరీ కేసులో ముమ్మర దర్యాప్తు

నాగలాపురం: పిచ్చాటూరు మండలం సిద్దిరాజు కండ్రిగ పంచాయతీ అగ్రహారంలో మాజీ సర్పంచ్‌ జయచంద్ర నాయుడు ఇంట్లో మంగళవారం భారీ చోరీ జరిగింది. దీనిపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పుత్తూరు డీఎస్పీ రవికుమార్‌ ఆదేశాల మేరకు పుత్తూరు సీఐ రవీంద్ర, పిచ్చాటూరు ఎస్‌ఐ రాఘవేంద్ర, తిరుపతి క్లూస్‌ టీం బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంట్లోని సీసీటీవీ పుటేజీని పరిశీలించి ఇంటి యజమాని జయచంద్ర నాయుడు, పని మనిషి సహా అందరినీ విచారించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు.

ఓట్లు పోతాయన్న

ఆందోళన వద్దు

తొట్టంబేడు: తమ ఓట్లు పోతాయని ఎవరూ ఆందోళన చెందొద్దని తొట్టంబేడు డిప్యూటీ తహసీల్దార్‌ జీవన్‌ కుమార్‌ తెలిపారు. మండలంలోని పూడి పంచాయతీలో బతికి ఉన్న ఒక మహిళ చనిపోయినట్లు ఓటరు జాబితాలో పేర్కొన్నారు. దీనిపై సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. స్పందించిన తహసీల్దార్‌ భారతి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్‌ జీవన్‌ కుమార్‌ను ఆదేశించారు. ఆయన గ్రామానికి వెళ్లి పోలింగ్‌ స్టేషన్‌ 263కు సంబంధించిన బీఎల్‌ఏల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎం.మునమ్మ పేరుతో ఇద్దరు ఉన్నారని తెలిపారు. వారిలో ఒకరికి 66 ఏళ్లు, మరొకరికి 54 ఏళ్లు ఉన్నాయని, 66 ఏళ్లున్న ఉన్నవారి వివరాలు మరణించిన వారి జాబితాలో ఉన్నాయని తెలిపారు. 54 ఏళ్ల వయస్సు ఉన్నవారు ప్రస్తుతం యాక్టివ్‌ ఓటర్‌గా ఉన్నారని వివరణ ఇచ్చారు. ఎవరి ఓటునూ తొలగించలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీఆర్వో (బీఎల్‌వో) భాగ్యశ్రీ, ఎలక్షన్‌ ఆపరేటర్‌ సురేష్‌, వీఆర్‌ఏలు హరి, శివ, టీడీపీ బీఎల్‌ఏ ప్రభాకర్‌, వైఎస్‌ఆర్‌సీపీ బీఎల్‌ఏ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

రూ.41 లక్షలకు మహిళ ఐపీ

తిరుపతి లీగల్‌ : తిరుపతి నగరంలోని కొర్లగుంట మారుతీనగర్‌కు చెందిన బి.కళ్యాణి అనే మహిళ తిరుపతి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో రూ.41 లక్షలకు ఐపీ దాఖలు చేసినట్టు ఆమె తరపు న్యాయవాది జి.వెంకటకుమార్‌ తెలిపారు. ఫిర్యాదులోని వివరాల మేరకు... పిటిషనర్‌ కళ్యాణి తన తల్లి అనారోగ్యం పాలుకావడంతో చికిత్స నిమిత్తం రాధ అనే మహిళ వద్ద రూ.ఐదు లక్షలను అప్పుగా తీసుకున్నారు. పది నెలలు వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఆమె వద్ద ప్రైవేటు చిట్టీలు వేశారు. చీటీ పాడిన సొమ్మును వడ్డీలకు జమ చేస్తూ అసలు చెల్లించాలంటూ రాధ చెబుతూ వచ్చారు. కళ్యాణి వద్ద రాధ, ఆమె భర్త కాళీ ప్రోనోట్లు, చెక్కులలో సంతకాలు తీసుకున్నారు. ఆమె బాగానికి వచ్చిన ఇంటిని విక్రయించగా వచ్చిన రూ.20 లక్షలను కూడా రాధ తీసుకున్నారు. ఇంకా సొమ్ము చెల్లించాలంటూ రాధ, ఆమె భర్తతో పాటు మరికొంతమంది కళ్యాణిని వేధిస్తూ వచ్చారు. కళ్యాణికి ఎటువంటి ఆధారం లేక సొమ్ము చెల్లించలేని స్థితిలో ఐపీ దాఖలు చేసినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఐదుగురిని ఆమె ప్రతివాదులుగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement