తల్లికి వందనం.. మళ్లీ నిరుత్సాహం | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం.. మళ్లీ నిరుత్సాహం

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

● సంఖ్య తగ్గించడమే సర్కార్‌ లక్ష్యమా? ● జిల్లాలో 2,42,089 మందికి తల్లికి వందనం

అడ్డగోలు నిబంధనలతో పలువురికి అందని పథకం

ఎన్నికల ముందు అర్హులైన అందరికీ తల్లికి వందనం పథకాన్ని అందజేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున నగదు బదిలీ చేస్తామని గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకాన్ని అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. దీనికితోడు పలు నిబంధనలు పెట్టారు. దీంతో అనేక మంది అర్హులకు పథకం అందలేదు. గత ఏడాదికంటే ఈ సారి మరింతమందిని అనర్హుల జాబితాలో చేర్చడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

తిరుపతి అర్బన్‌: తిరుపతి జిల్లాలో 2026–27 ఏడాదికి సంబందించి 2,42,089 మంది పిల్లలను మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులుగా అధికారులు తేల్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల వద్ద నోటీస్‌ బోర్డులో అర్హుల జాబితాను, మరోవైపు అనర్హుల జాబితాను ప్రచురించారు. ఒక్క కుటుంబంలో ఒక్క విద్యార్థి ఉన్నవారు 93,300 మంది, ఇద్దరు పిల్లలు ఉన్నవారు 71,574 మంది, ముగ్గురు పిల్లలు ఉన్నవారు 9793 మంది, నలుగురు పిల్లలు ఉన్నవారు 606, ఐదుగురు పిల్లలు ఉన్న వారికి 42 మందికి, ఆరుగురు పిల్లలు ఉన్న నాలుగు కుటుంబాలకు తల్లికి వందనం జాబితాలో అర్హులుగా ఉన్నట్లు వెల్లడించారు.

అడ్డగోలు నిబంధనలు

పేద కుటుంబాలకు చెందిన వందలాది మంది విద్యార్థుల పేర్లు అర్హుల జాబితాలో లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అడ్డదిడ్డమైన కారణాలు చూపడంపై మండిపడుతున్నారు. ప్రధానంగా విద్యుత్‌ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడారని, అలాగే కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించారని, పట్టణ ప్రాంతాల్లో 1000 అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉందని, కుటుంబానికి నెలసరి ఆదాయం రూ.12 వేలకంటే ఎక్కువ ఉందని తెలిపారు. నాలుగు చక్రాల వాహనం ఉందని, రైస్‌ కార్డు లేదని, తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చెప్పే వాటిలో తమకు లేవని, తాము ఆదాయపు పన్ను ఎక్కడ కడుతున్నామో చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించడానికే ఇలా నిబంధనలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పరిశీలించి అర్హులకు పథకాన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement