తిరుమల: తిరుమలలో బుధవారం పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నరేష్, దర్శన్, పేష్కార్ రామ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


