● డ్వాక్రా సంఘ సభ్యులతో సమీక్షపై మండిపాటు ● తనకు మాటైనా చెప్పకపోవడంపై అధికారులను తప్పుపట్టిన ఎమ్మెల్యే
తిరుపతి తుడా: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాకలక్ష్మి వ్యవహార శైలిపై తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అసంతృప్తి వ్యక్తంచేశారు. పనబాక లక్ష్మి మంగళవారం తిరుపతి మెప్మా పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులతో తిరుపతిలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆరణి శ్రీనివాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో నగర అభివృద్ధితోపాటు వివిధ శాఖలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మెప్మాపై సమీక్ష జరిగే క్రమంలో పనబాకలక్ష్మి నిర్వహించిన సమీక్షపై ఆరాతీశారు. సమీక్ష విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఈ విషయంపై కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఆ సమీక్ష గురించి తమకు కూడా తెలియదని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. దీనిపై మెప్మా సీఎంఎం కృష్ణవేణి మాట్లాడుతూ పీడీ ఆదేశాల మేరకు కొన్ని డివిజన్ల పరిధిలోని డ్వాక్రా సంఘం సభ్యులను పంపినట్లు చెప్పారు. కమిషనర్‌కు, డిప్యూటీ కమిషనర్‌కు, ఎమ్మెల్యేకి కూడా తెలియకుండా మీరు సమీక్ష ఎలా నిర్వహిస్తారు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపైన ఇలాంటివి పునరావృతం కాకూడదని ఎమ్మెల్యే సున్నితంగా హెచ్చరించారు.


