ఈజీగా దోపిడీలతో చెలామనీ! | - | Sakshi
Sakshi News home page

ఈజీగా దోపిడీలతో చెలామనీ!

Jul 21 2026 2:00 AM | Updated on Jul 21 2026 2:00 AM

● శాంతి భద్రతలకు సవాల్‌

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కలకలం

వరదయ్యపాళెం: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం నకిలీ కరెన్సీ ముఠాలు, పట్టపగలే దోపిడీలకు పాల్పడే ముఠాలు, యువకులను టార్గెట్‌ చేసే సెల్‌ఫోన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు సామాన్య ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

బయట పడ్డ నకిలీ బ్లాక్‌మనీ ముఠా బండారం

తిరుపతి జిల్లా పిచ్చాటూరులో సంచలన ఘటన చోటుచేసుకుంది. నకిలీ బ్లాక్‌మనీని అసలు కరెన్సీకి ఐదు రెట్లు ఇస్తామని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న ముఠాను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన అజ్జీరా రాజారామును లక్ష్యంగా చేసుకుని, అతడిని ఇంటికి పిలిచి ఆట కోసం వాడే టాయ్‌ కరెన్సీని ఒరిజినల్‌గా చూపించారు. నమ్మిన బాధితుడి నుంచి రూ.20 వేలు తీసుకుని, బయటకు వెళ్లే సమయంలో కత్తులతో బెదిరించి ఇంటి తలుపులు మూసేశారు. సమాచారం అందుకున్న పిచ్చాటూరు పోలీసులు దాడి చేసి ప్రకాష్‌, మురళి, షేక్‌ అబ్దుల్‌ అక్మల్‌, పల్లపు రవికుమార్‌, కరేటి ప్రణయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5000 టాయ్‌ కరెన్సీ నోట్లు, చెక్కపెట్టీ, లగేజ్‌ బ్యాగ్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ పేరుతో ఇలాంటి ముఠాలు జిల్లాల్లో చురుగ్గా తిరుగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

‘సాయం‘ పేరుతో దోపిడీ

వరదయ్యపాళెం మండలం, సంతవేలూరు మార్గంలో మరో దారుణం జరిగింది. కళతూరు గిరిజన కాలనీకి చెందిన శరత్‌కుమార్‌(18) బైక్‌పై వెళ్తుండగా ఇద్దరు యువకులు అడ్డుకున్నారు. ‘బైక్‌లో పెట్రోల్‌ అయిపోయింది, సాయం చేయండి‘ అని నమ్మించారు. మంచితనంతో సాయం చేస్తుండగా, ఒకడు శరత్‌ జేబులోని సెల్‌ఫోన్‌ లాక్కునేందుకు యత్నించాడు. ప్రతిఘటించడంతో మరొకడు బీరు సీసాతో శరత్‌ తలపై కొట్టాడు. గాయపడిన శరత్‌ నుంచి ఫోన్‌ లాక్కుని దుండగులు పరారయ్యారు. ఇలాంటి ఘటనలు రోజువారీ జరుగుతుండడం ఒంటరిగా గ్రామీణా ఆధారంలో వెళ్లే వాహనదారులు, పాదాచార్యులు ఆందోళనకు గురవుతున్నారు.

పేట్రేగిపోతున్న చైన్‌ స్నాచింగ్‌ ముఠా

చిత్తూరు జిల్లా, విజయపురం మండలం, పన్నూరు గ్రామంలో పట్టపగలు దోపిడీ కలకలం సష్టించింది. హెల్మెట్లు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గహిణి కామాక్షి వద్దకు వచ్చి స్పేనర్‌ కావాలని అడిగారు. ఆమె సాయం చేసేందుకు రాగానే, చేతిలోని హెల్మెట్‌తో బలంగా కొట్టారు. తేరుకునేలోపే మెడలోని రూ.4 లక్షల విలువైన బంగారు తాళిబొట్టు, చైన్‌ను లాక్కుని వేగంగా పారిపోయారు. ఇలాంటి ఘటనలు రోజువారీ జిల్లాలో అక్కడక్కడా జరుగుతుండడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది.

పోలీసులకు సవాల్‌

ఈ మూడు ఘటనలు చూస్తే జిల్లాల్లో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని స్పష్టమవుతోంది. నకిలీ కరెన్సీ, దోపిడీలు, స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలు, యువకులు టార్గెట్‌ అవుతున్నారు. పోలీసు శాఖ హైవేలు, గ్రామీణ రోడ్లపై రాత్రిపగలు గస్తీ పెంచాలి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజలు కూడా అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement