18 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

18 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం

Jul 21 2026 2:00 AM | Updated on Jul 21 2026 2:00 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: అన్నమయ్య జిల్లా, పీలేరు రోడ్డు మార్గంలో, గుడిపాల – రాణీపేట హైవేలో రెండు చోట్ల కారులో తరలిస్తున్న 18 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారు అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్‌ చేశారు. ఏఆర్‌ఎస్‌ఐ కె.మహేశ్వరనాయుడు బృందం స్థానిక అటవీ సిబ్బంది జగదీష్‌, ఆషాబీతో కలసి అన్నమయ్య జిల్లా కేవీ పల్లి–పీలేరు మార్గంలో పొంతల చెరువు క్రాస్‌ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున ఒక కారు వేగంగా వస్తూ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని గమనించి కారును ఆపి అందులోని వ్యక్తులు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఇద్దరినీ పట్టుకోవడంలో మరో వ్యక్తి పారిపోయాడు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడు తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. 11 ఎర్రచందనం దుంగలు, కారుతో సహా పట్టుబడిన వారిని తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాసులు రెడ్డి, ఏసీఎఫ్‌ జె. శ్రీనివాస్‌ విచారించారు. ఈ కేసును సీఐ ఖాదర్‌ బాషా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాణీపేట హైవేలో 7 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

తిరుపతి నిఘా విభాగం డివిజినల్‌ పారెస్టు అధికారి కె.రామకొండారెడ్డికి అందిన సమాచారం మేరకు గుడిపాల – రాణీపేట హైవేలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ సుబ్బరాయుడు నేతృత్వంలో సోమవారం ఉదయం యల్లమంద ఫారెస్టు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇన్నోవా వాహనం అతి వేగంగా వెళ్లింది. వాహనాన్ని వెంబడించి రాణీపేట హైవేలోని బొమ్మసముద్రం వద్ద పట్టుకునే ప్రయత్నంలో వాహనం ఆపి అందులోని వ్యక్తులు పారిపోయారు. అందులో 7 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వ్యక్తులు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. వాహనం సీజ్‌ చేసి 229.200 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేసి కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఎఫ్‌ఎస్‌వో చంద్రబాబు, ఇన్‌చార్జి ప్రసాద్‌కుమార్‌, సిబ్బంది సాయి కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement