తిరుపతి సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులను 2,700 నుంచి 10 వేలకు పెంచి మెగా పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసేలా కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షుడు మన్నం ప్రేమ్‌కుమార్ విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఎస్వీయూకు విచ్చేసిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంటనే 10 వేల పోస్టులతో మెగా పోలీస్ నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ యువత ఆవేదనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీని కోరినట్లు తెలిపారు. విద్యార్థి నాయకులు లిఖిత, పవను, కిషోర్, వంశీ పాల్గొన్నారు.
డిజిటల్ గుర్తింపు కార్డులను స్వీకరించాలి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఆర్టీసీ బస్సుల్లో రాయితీ లేదా ఉచిత ప్రయాణ సౌకర్యం పొందేందుకు ప్రయాణికులు చూపించే డిజిటల్ గుర్తింపు పత్రాలను స్వీకరించాలని అధికారులు కండక్టర్, డ్రైవర్లకు సూచించారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్టీసీ డిపోలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాల డిజిటల్ రూపాలలో కూడా స్వీకరించాలని తెలిపారు. ప్రయాణికులు తమ గుర్తింపు పత్రాలను వాట్సాప్‌లోని ఆధార్ లేదా మొబైల్ ఫోన్‌లోని ఫొటో/డిజిటల్ రూపంలో చూపించినప్పుడు, అవి స్పష్టంగా ఉండి చెల్లుబాటయ్యే వివరాలు కలిగి ఉంటే, వాటిని అనవసరంగా తిరస్కరించకూడదని సిబ్బందికి సూచించారు. రాయితీ లేదా ఉచిత ప్రయాణానికి అర్హత ఉన్న ప్రయాణికులకు, వారి చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రం డిజిటల్ రూపంలో ఉన్న కారణంగా ప్రయాణ సౌకర్యాన్ని నిరాకరించరాదన్నారు.
శివాలయంలో ఆభరణాల చోరీ
రేణిగుంట:మండలంలోని వెదుళ్లచెరువు గ్రామంలోని శ్రీ శ్రీ ఓంకార జ్యోతి లింగేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం ఉద యం పూజారి గుర్తించి రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అర్బన్ ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా ఆధారాలను సేకరించారు. దుండగులు ఆలయంలోని హుండీని పగులగొట్టి, అందులో ఉన్న నగదుతో పాటు స్వామి, అమ్మవార్లకు అలంకరించే సుమారు రూ.6 లక్షల విలువచేసే వెండి, బంగా రు ఆభరణాలు చోరీ చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.


