తిరుపతి రూరల్: మద్యం మత్తులో మెట్లపై నుంచి జారి కిందపడిన యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగేశ్వర్ నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తికి చెందిన భాస్కర్ (28) తిరుపతిలోని ఆంధ్ర బ్యాంకు కాలనీలో టెన్నిస్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. లింగేశ్వర్ నగర్‌లోని ఓ ఇంట్లో స్నేహితుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. స్నేహితుడు తన స్వగ్రామానికి వెళ్లడంతో భాస్కర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ క్రమంలో మద్యం సేవించిన భాస్కర్ మొదటి అంతస్తు నుంచి మెట్లపై దిగుతుండగా అదుపుతప్పి బోర్లా పడిపోయాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి తెలిపారు.
పది రోజులు జైలు
రేణిగుంట: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి తిరుపతి స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు పది రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం.. రేణిగుంట మండలం, కరకంబాడి తారకరామనగర్‌కు చెందిన పి.వెంకటేష్ (30) ఇటీవల మద్యం సేవించి వాహనం నడుపుతూ రేణిగుంట అర్బన్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై మోటార్ వాహన చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని తిరుపతిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. నేరం రుజువు కావడంతో నిందితుడు వెంక టేష్‌కు పది రోజుల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.


