‘మల్లిమడుగు’లో మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

‘మల్లిమడుగు’లో మట్టి మాఫియా

Jul 20 2026 1:02 AM | Updated on Jul 20 2026 1:02 AM

● రాత్రివేళ ఇష్టారాజ్యంగా తవ్వకాలు ● నిత్యం వందలాది ట్రిప్పుల మట్టి రవాణా ● అక్రమార్కులకు అండగా పోలీసులు ● జలాశయంలో వెలుస్తున్న భారీ గుంతలు ● పట్టించుకోని అధికారులు

రేణిగుంట : మండలంలోని కరకంబాడి పంచాయతీలో ఉన్న మల్లిమడుగు జలాశయం నుంచి రాత్రి వేళల్లో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ నేత పేరు చెప్పుకొని వందల ట్రిప్పుల మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. మట్టి, ఇసుక అక్రమ తరలింపుపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా మట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే రేణిగుంట మండలంలోని అధికారులు మాత్రం కలెక్టర్‌, ఎస్పీ ఆదేశాలను బేఖాతర్‌ చేసేస్తున్నారు. మల్లిమడుగు జలాశయంలో ప్రతిరోజూ రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల వరకు మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. వందల టిప్పుల గ్రావెల్‌ను భారీ టిప్పర్లలో కడప జాతీయ రహదారి మీదుగా తిరుపతి సమీపంలోని వెంచర్లకు తరలిస్తున్నా స్పందించడం లేదు. హైవేలో పెట్రోలింగ్‌ వాహనం ఉన్న సమయంలోనే మట్టి అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ కన్నెత్తిచూడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఒకరిపై ఒకరు..

మట్టి అక్రమ తవ్వకాలను, రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చూపుతున్నారు. నెలవారీ మామూళ్లు ముడుతుండడంతోనే అధికారుల అక్రమ తవ్వకాలు, రవాణా వైపు వెళ్లడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాలను సైతం తుంగలో తొక్కే స్థాయిలో ముడుపులు చేతులుమారుతున్నాయని స్థానికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులే నేరుగా దాడులు చేస్తే కానీ, మల్లిమడుగు సంరక్షణ సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.

మల్లిమడుగు జలాశయంలో హిటాచీ

జలాశయంలోనే హిటాచీలు..

వారం రోజులుగా హిటాచీలు మలిమడుగు జలాశయంలోనే ఉంచుతున్నారు. రాత్రి వేళ తవ్వకాలు సాగిస్తున్నారు. స్థానిక అధికారులకు తెలిసే మొత్తం దందా నడుస్తున్నప్పటికీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచ్చలవిడిగా మట్టి తోడేస్తుండడంబతో జలాశయానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement