సూళ్లూరుపేట : పట్టణంలోని పార్క్‌వీధిలో సత్య జూనియర్ కళాశాల ఎదురుగా ఓ మహిళ మెడలో గొలుసును గుర్తుతెలియని వ్యక్తుల లాక్కెళ్లారు. శనివారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సీపీ ఫుటేజీని ఆదివారం పరిశీలించారు. బాధితురాలు మరో మహిళతో కలిసి బజారులో వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. అపహరణకు గురైన బంగారు గొలుసు 24 గ్రాములు ఉంటుందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపారు.
బావిలో పడి యువకుడి మృతి
ఓజిలి : మండలంలోని మానమాలలో ఆదివారం చేపలను పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మన్నూరు వెంకటేష్(35) అనే యువకుడు మృతి చెందాడు. వివరాలు.. వెంకటేష్ కొంతకాలంగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని బావి వద్దకు చేపలు పట్టుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో ఫిట్స్ రావడంతో బావిలో పడిపోయాడు. వెంకటేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా బావిలో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాయం కోరి..
సెల్‌ఫోన్ లాక్కెళ్లి..!
వరదయ్యపాళెం : మండలంలోని సంతవేలూరు మార్గంలో వీరాస్వామినగర్ వద్ద ఓ యువకుడి సెల్‌ఫోన్‌ను ఇద్దరు దుండగులు అపహరించారు. వివరాలు.. కళత్తూరు గిరిజన కాలనీకి చెందిన కె.శరత్‌కుమార్(18) ఆదివారం బైక్‌పై వరదయ్యపాళెం వెళ్లి తిరిగివస్తుండగా ఇద్దరు యువకులు అడ్డుకున్నారు. తమ బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని, సాయం చేయాలని తమిళంలో కోరారు. ఇందుకు అంగీకరించిన శరత్ కొంతదూరంపాటు వారి బైక్‌ను కాలితో నెట్టుకుంటూ తన బైక్‌తో తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వారిలో ఒకడు శరత్ బైక్‌పై కూర్చుని హఠాత్తుగా జేబులోని సెల్‌ఫోన్‌ను లాక్కునేందుకు యత్నించాడు. శరత్ ప్రతిఘటించడంతో ఇద్దరు దుండగులు బీరు సీసాతో దాడి చేశారు. అనంతరం సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వరదయ్యపాళెం ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.
ప్రహరీ గోడ ధ్వంసంపై కేసు
తిరుపతి క్రైమ్ : నగరంలోని కృష్ణతేజ థియేటర్ సమీపంలో నిర్మిస్తున్న ప్రహరీ గోడను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. రేణిగుంట రోడ్డు ప్రాంతానికి చెందిన ఏజీపీ సిటీ ప్రైవేట్ లిమిటెడ్‌లో మేనేజర్ తల్లూరు చాణక్య (38) కృష్ణతేజ థియేటర్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సీఎన్‌జీ స్టేషన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో నిర్మాణ పనులు ముగించుకుని సిబ్బందితో కలిసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిర్మాణ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, రాత్రి నిర్మించిన ప్రహరీ గోడ, బేస్‌మెంట్ సెంటరింగ్‌తో పాటు ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.50 వేల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 90,045 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,573 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


