తిరుమల: శ్రీరంగం శ్రీమత్ ఆండవన్‌ఆశ్రమం పీఠాధిపతి వరాహ మహాదేశికన్‌స్వామీజీ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామీజీ తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకోగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఆలయ పేస్‌కార్ రామకృష్ణ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీశ్రీ వరాహ మహాదేశికన్ స్వామీజీకి సంప్రదాయబద్ధంగా శ్రీవారి చటారి సమర్పించి ఆలయ మర్యాదలు నిర్వహించారు. అనంతరం స్వామీజీ ఆలయ ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తదనంతరం మఠంలో నిర్వహించిన కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు స్వామీజీతో మర్యాదపూర్వకంగా సమావేశమై పలు ఆధ్యాత్మిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అర్చకులు, వేద పండితులు, మఠ ప్రతినిధులు పాల్గొన్నారు.
అలాగే తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరిష్‌కుమార్‌సింగ్, అస్సాం గవర్నర్ లక్ష్మణ్‌ఆచార్య, మహారాష్ట్ర మినిస్టర్ నితీష్ నారాయణ రాణే, ఎంపీ నారాయణ రాణే, ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.


