తిరుమల: అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం తిరుమల పద్మావతి విశ్రాంతి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత కొన్నేళ్లుగా చోటుచేసుకున్న వన్యప్రాణుల ఘటనలు, వాటి ధోరణులపై సమగ్ర విశ్లేషణ చేపట్టి, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని సూచించారు. టీటీడీ డీఎఫ్‌ఓ ఫణికుమార్ నాయుడు మాట్లాడుతూ, గత రెండేళ్లలో చిరుతలు ఎక్కువగా సంచరించిన ప్రాంతాలు, ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాల పనితీరు, వన్యప్రాణుల సంచార ధోరణులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌ఓ సాయిబాబా, టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, తిరుమల విజిలెన్స్ అధికారి సురేంద్ర పాల్గొన్నారు.


