నాగలాపురం : స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో ఆదివారం చెత్తను తగలబెట్టడంతో ప్రమాదవశాత్తు సమీపంలోని ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. వివరాలు.. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలను పోలీసులు సమీపంలోని వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో పార్క్ చేశారు. ఆదివారం ఉదయం కార్యాలయ సిబ్బంది చెత్తను గుట్టగా పోసి నిప్పంటించారు. ఈ సమయంలో గాలికి నిప్పురవ్వలు సమీపంలోని ద్విచక్రవాహనాలపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే 5 ద్విచక్రవాహనాలు కాలిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.


