ప్రేమ పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మోసం

Jul 12 2026 11:58 PM | Updated on Jul 12 2026 11:58 PM

– పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

డక్కిలి : మనస్పూర్తిగా ప్రేమిస్తున్నా.. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంట్లో ఒప్పించి ఇద్దరం పెళ్లిచేసుకుందామని నమ్మించి మోసం చేసిన ఓ యువకుడి ఇంటి ముందు బాధితురాలు ఆదివారం నిరసనకు దిగింది. అనంతరం పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. అనంతరం బాధితురాలు మాట్లాడుతూ మండలంలోని డి.ఉప్పరలపల్లె (గొల్లపల్లికు చెందిన నల్లిపాక వంశీ అనే యువకుడు తనను గత ఆరేళ్లుగా ప్రేమిస్తున్నాని , పెళ్లిచేసుకుంటానని నమ్మబలికాడని వెల్లడించింది. పలుమార్లు లైంగికదాడికి సైతం పాల్పడ్డాడని ఆరోపించింది. పెళ్లి చేసుకోమని కోరగా, పెద్దలతో మాట్లాడి చేసుకుంటానని ఏళ్ల తరబడి వాయిదాలు వేశాడని వెల్లడించింది. దీనిపై గట్టిగా నిలదీయడంతో తనకు వీలుపడదని, పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తమ ప్రేమ విషయం తెలుసుకున్న వంశీ తల్లి నాగరాజమ్మ శనివారం రాత్రి తమ ఇంటికి దాడి చేసిందని విలపించింది. అందుకే శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు వంశీ ఇంటి ముందే కూర్చుని నిరసన తెలిపినట్లు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం డి.ఉప్పరపల్లెకు వెళ్లి విచారణ చేపట్టారు.

ముక్కంటి సేవకు

పోటెత్తిన భక్తులు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్త జనసంద్రంగా మారింది. వరుస సెలవులు రావడంతో సుమారు 36 వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 754, రూ.200 శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా 2,892 మంది, రూ.50ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా 2,686మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టికెట్ల ద్వారా 4117 మంది, రూ.750 టికెట్ల ద్వారా 1,405, రూ.1,500 టికెట్ల ద్వారా 454మంది, రూ.2,500 టికెట్ల ద్వారా 356 మంది, రూ.5 వేల టికెట్ల ద్వారా 153 మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. 17,593 ప్రసాదాలు అమ్ముడైనట్లు ఆలయ అధికారులు వివరించారు.

కేసులు.. జైళ్లకు భయపడం

తిరుపతి మంగళం : చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం తిరుపతి అధ్యక్షుడు లక్కాకుల దినేష్‌ రాయల్‌ తెలిపారు. ఆదివారం ఈ మేరకు దినేష్‌రాయల్‌ నివాసానికి వెళ్లి పోలీసులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దినేష్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ తమ నాయకుడు భూమన అభినయ్‌రెడ్డితో కలిసి ధర్నాలు, ఉద్యమాలు చేపడితే అక్రమ కేసులు బనాయిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన సాగుతోందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం భూమన అభినయ్‌రెడ్డి వెంటే నిలబడి పోరాడుతామని, సర్కారు బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు.

భాకరాపేట ఘాట్‌ రోడ్డులో టిప్పర్‌ బోల్తా

భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట ఘాట్‌ రోడ్డులో ఆదివారం ఒక టిప్పర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంతో ఘాట్‌ రోడ్డుపై రెండు వైపులా వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ సహాయంతో టిప్పర్‌ను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఘాట్‌ రోడ్డులో వాహనదారులు నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.

పేకాట స్థావరంపై

పోలీసుల దాడి

– 14 మంది అరెస్ట్‌

చంద్రగిరి: పేకాట స్థావరాలపై దాడి చేసి 14 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సీఐ సురేష్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని పుల్లయ్యగారిపల్లి సమీపంలోని జగనన్న కాలనీలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో తమ సిబ్బందితో కలిసి దాడి చేసినట్టు పేర్కొన్నారు. 14 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.34,480 నగదు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ దాడుల్లో ఎస్‌ఐలు రవిప్రకాష్‌రెడ్డి, అరుణాచలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement