ఎంపీటీసీ సభ్యులపై కక్ష సాధింపు
వరదయ్యపాళెం: నిబంధనల ప్రకారం ప్రతి ఎంపీటీసీ సభ్యుడికి నెలకు రూ.3 వేల గౌరవ వేతనం చెల్లించాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రెండు విడతలుగా వేతనాలు చెల్లించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి నిలిచిపోయిన వేతనాలు, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వలోనూ విడుదల కాలేదు. ఫలితంగా ఒక్కో సభ్యుడికి 35 నెలల బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం రూ. 1.05 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు మొత్తంగా రూ. 4.27కోట్ల మేర వేతన బకాయిలు పేరుకుపోయాయి.
వైఎస్సార్‌సీపీ సభ్యులపై వివక్ష
జిల్లాలో మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీకి చెందిన వారు కావడంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిధులు విడుదల చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.వేతనాల కోసం మేము ప్రాధేయపడాలా అని ఎంపీటీసీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వేతనాలే కాకుండా గ్రామాల్లో తమకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని సభ్యులు వాపోతున్నారు. మండల పరిషత్ సమావేశాల్లో తాము లేవనెత్తిన ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని, కేవలం కూటమి నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు.
స్వయం ప్రతిపత్తి అవసరం
రాజ్యాంగంలోని 33వ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టికల్ 223 జీఓ ఉల్లంఘనకు పాల్పడుతోంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అభివృద్ధి పనుల్లో ఎంపీటీసీ సభ్యుల ప్రమేయం ఉండాలి. కానీ, 15వ ఆర్థిక సంఘం నిధులను సైతం బాబు సర్కార్ ఎంపీటీసీ సభ్యులకు తెలియకుండానే ఇతర పనులకు మళ్లిస్తోంది.
ఇక మిగిలింది రెండు నెలలే:
ఎంపీటీసీలు పదవీకాలం ఇక రెండు నెలలు మాత్రమే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌కు పదవీకాలం ముగియనుంది. అయితే వేతనాలు మాత్రం మూడేళ్ల నుంచి అందలేదు. కనీసం పదవీకాలం ముగిసే లోపైనా గౌరవ వేతనాలు అందతాచేమోనని ఎదురు చూస్తున్నారు.
జిల్లాలోని ఎంపీటీసీ సభ్యుల వివరాలు
సత్యవేడు : 81
సూళ్లూరుపేట : 62
వెంకటగిరి : 66
శ్రీకాళహస్తి : 65
తిరుపతి : 37
చంద్రగిరి : 96
క్షేత్రస్థాయిలో కీలకమైన ప్రజాప్రతినిధులు వేతన వెతలు అనుభవిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ సభ్యులకు 35 నెలలుగా జీతాలు అందకపోవడంతో అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడుతున్నారు. కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు.


