నిరంతరాయ విద్యుత్ సరఫరానే ధ్యేయం
తిరుపతి రూరల్: వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనే ధ్యేయంతో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సూచించారు. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న ’కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ చంద్రశేఖరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవాశీర్వాదంతో కలిసి తిరుపతి జిల్లా, నారాయణవనం మండలం బ్రాహ్మణ తాంగేళిలో పర్యటించారు. ఆ గ్రామంలో విద్యుత్ లైన్లను పరిశీలించి, సరఫరా తీరుపై వినియోగదారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రూఫ్ టాప్ సోలార్, స్మార్ట్ మీటర్ల ఉపయోగాలను వినియోగదారులకు వివరించారు. ఆ తర్వాత నారాయణవనం 33/11 కేవీ సబ్–స్టేషన్‌ను తనిఖీ చేశారు. సోలార్ విద్యుత్ వినియోగంపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అలాగే స్మార్ట్ మీటర్ల అంశంపై వినియోగదారుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలన్నారు. వినియోగదారులకు 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం, లో–వోల్టేజ్ సమస్యను అధిగమించడం తదితర సమస్యల సత్వర పరిష్కారం కోసమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిప్రసాద్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయప్రకాష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.


