చెరువును పంచేసుకుంటున్నారు
తిరుపతి నగరంలో అతి విలువైనది కొంకచెన్నాయిగుంట చెరువు. ఈ ప్రాంతంలో నివాసస్థలాలకు మంచి డిమాండ్ ఉండడంతో టీడీపీ, జనసేనకు చెందినవారు ఆక్రమించుకున్నారు. గతంలో మాజీ సైనికోద్యోగులకు పట్టాలు ఇచ్చినా... వారినీ ఆ స్థలంలోకి అడుగుపెట్టనివ్వలేదు. అంతటితో ఆగని పచ్చ బ్యాచ్ ఏకంగా మాజీ సైనికోద్యోగులు తమకు అమ్మినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారు. ప్లాట్లు వేసి అమ్మి సొమ్ము చేసుకున్నారు. చెరువు ఆక్రమణకు గురైందని పలుమార్లు మీడియా, పత్రికలు వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతీసారి రెవెన్యూ అధికారులు వచ్చి తాత్కాలిక షెడ్లు తొలగించి చేతులు దులిపేసుకుని వెళ్తున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్‌కి కూతవేటు దూరంలో కొంకచెన్నాయిగుంట చెరువు పోరంబోకు ఉంది. వైఎస్‌ఆర్ సీపీ హయాంలో మాస్టర్‌ప్లాన్ రోడ్లు వేయడంతో నగరం అనూహ్యంగా విస్తరిస్తోంది. ఈ చెరువు పోరంబోకు ఇప్పుడు అత్యంత విలువైనదిగా మారింది. కోట్ల రూపాయలు విలువజేసే ఈ చెరువును ఆక్రమించుకుని అమ్మి సొమ్ము చేసుకునేందుకు టీడీపీ, జనసేన నేతలు పక్కా పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నారు. 1992లో 35 మంది స్వాతంత్య్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం ఆ చెరువు పోరంబోకు భూమిని నివాస స్థలాల కోసం పట్టాలు ఇచ్చింది. పట్టాలు పొందిన వారు పక్కాగృహాలు నిర్మించుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే అంతకు ముందే మరో 13 మంది ఆ చెరువు పోరంబోకు భూమిని 1983లో తమకు విక్రయించారని మరో వర్గం వారు అడ్డుకున్నారు.
మళ్లీ ఆక్రమణలు
అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ, జనసేన నాయకులు కొందరు ఆ చెరువు పోరంబోకు భూమిపై కన్నుపడింది. కొంకచెన్నాయిగుంట చెరువు వివరాలన్నీ తెలిసిన కూటమి నాయకులు సీపీఐ, సీపీఎంకి చెందిన కొందరి సహకారంతో రంగంలోకి దిగారు. తమకు ఇచ్చిన నివాస స్థలాలను స్వాతంత్య్ర సమరయోధులే వచ్చి 35 మందికి విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014లో టీడీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి చెరువు పోరంబోకు భూమిని ప్లాట్లుగా విక్రయించడం ప్రారంభించారు. అంకణం రూ.25 వేల నుంచి రూ.50 వేలతో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు రూ.లక్ష చొప్పున విక్రయిస్తున్నారు. అప్పట్లో దీనిపై సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించారు. ఈ చెరువు ఆక్రమణకు గురైనప్పుడు స్థానికులు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు తాము ఎవ్వరికీ పట్టాలివ్వలేదని స్పష్టం చేశారు. ఆ భూమి చెరువు పోరంబోకు అని ఆధారాలతో న్యాయస్థానానికి సమర్పించారు. ఆ భూమి చెరువు పోరంబోకు అని తీర్పు కూడా ఇచ్చారు.
మేం చూసుకుంటాం.. కానిచ్చేయండి
అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నేతలు మరోసారి కొంకచెన్నాయిగుంట చెరువుపై దృష్టి పెట్టారు. నకిలీ పత్రాలతో నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం. పత్రికలు, మీడియాలో వచ్చేలోపు నిర్మాణాలు పూర్తి చేసి విద్యుత్ మీటర్, ఇంటి పన్ను తీసుకోమని ఉచిత సలహా ఇచ్చినట్లు తెలిసింది. అక్రమార్కులు హడావిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో టీడీపీ, జనసేన ప్రజా ప్రతినిధుల పీఏలు రంగంలోకి దిగడం గమనార్హం.
చెరువును పంచేసుకుంటున్నారు


