రీసర్వేలో న్యాయం జరగలేదు
ఈ రైతు పేరు ఫాల్గుణరెడ్డి. తిరుపతి రూరల్ మండలం కూపుచంద్రపేట గ్రామానికి చెందిన రైతుకు ఐదెకరాల వ్యవసాయ పొలం ఉంది. ఆ భూమిలో పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. తాతల కాలం నుంచి ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకం రావడం లేదు. దీనికి కారణం ఆ భూమి ఇనాం భూములుగా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కింది. రీసర్వే పూర్తి చేసిన తరువాత పట్టాదారు పాసు పుస్తకం వస్తుందని ఆ రైతు ఎంతో ఆశపడ్డాడు. రీసర్వే ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇంత వరకు పట్టాదారు పాసుపుస్తకం రాలేదు. పట్టాదారు పాసుపుస్తకం రాకపోవడానికి ప్రధాన కారణం రీసర్వే ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్ కరెక్షన్ చేయడానికి వెబ్ ల్యాండ్‌లో అవకాశం లేకపోవడమేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆ రైతు మాత్రం పట్టాదారు పాసుపుస్తకం కోసం ఎదురు చూస్తూనే ఉ న్నాడు.
సమస్యలకు లేదు పరిష్కారం
వరదయ్యపాళెం: ఇతని పేరు అత్తిపట్టు రాంబాబు. వరదయ్యపాళెం మండలం కోవూరుపాడు గ్రామంలో నాలుగు ఎకరాల పొలం ఉంది. తొలివిడతలో రీసర్వే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తండ్రి పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమి పూర్తిస్థాయిలో ఇతని పేరిట ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ఆయన తల్లి పేరిట ఒకటిన్నర ఎకరానికి గత ఏడాది ఈ–పాస్‌బుక్ వచ్చింది. అయితే ప్రస్తుత నూతన పాసుపుస్తకాల్లో ఆమె పేరు లేదు. కేవలం అతని పేరిట 55 సెంట్లకు మాత్రమే పాసుపుస్తకం వచ్చింది. ప్రస్తుతం రీసర్వే కార్యక్రమంలో తన పేరిట మార్చుకునేందుకు ఆన్‌లైన్‌లో ఆప్షన్ విడుదల చేయలేదు.
తప్పుల తడకగా రీ సర్వే
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు చంద్రశేఖర్. చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట సమీపంలోని వడ్డిపల్లి. ఇతనికి భాకరాపేట గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 180/బిలో 2.18సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. రీసర్వే ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఆ విస్తీర్ణం 2.05 ఎకరాలకు కుదించారు. తన భూమి ఎందుకు తగ్గిందని ఆ రైతు అడిగితే అదంతేనని చెప్పి సర్వేయర్లు వెళ్లిపోతున్నారు. దీనికి కారణం రీసర్వే ప్రక్రియలో యంత్రాలు పెట్టి డ్రోన్‌ల సాయంతో కొలతలు వేయడం, సరిహద్దులు సరిగా గుర్తించక పోవడంతోనే విస్తీర్ణం తగ్గిపోయిందని ఆ రైతు ఆరోపిస్తున్నారు. తహశీల్దార్‌కు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా ఆయనకు జవాబు చెప్పే వారు లేరు.
రీసర్వేలో న్యాయం జరగలేదు
రీసర్వేలో న్యాయం జరగలేదు


