కాలువలోకి దూసుకెళ్లిన టెంపో ట్రావెలర్
– ఇద్దరికి తీవ్ర గాయాలు
చంద్రగిరి: చంద్రగిరి–తిరుపతి రూరల్ మండలం సరిహద్దులోని మల్లవరం కూడలి వద్ద శనివారం రాత్రి టెంపో ట్రావెలర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన భక్తులు టెంపోట్రావెలర్ వాహనంలో తిరువణ్ణామలై వెళ్లారు. అక్కడ స్వామిని దర్శించుకుని శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో మల్లవరం కూడలి వద్ద వాహనం అదుపుతప్పి రహదారికి అనుకుని ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలోని 10 మంది ప్రయాణికుల్లో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఇద్దరి కాళ్లలోకి ఇనుప రాడ్లు చొచ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనం ద్వారా తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


