తిరుపతి అర్బన్: పది పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్‌లోని తమ చాంబర్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న పది పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పా రు. ఈ ఏడాది 31,334 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉదయం 9గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య, ఇతర సమస్యలతో పరీక్ష కేంద్రానికి 9.50 గంటలకు చేరుకున్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఉదయం 9.50 గంటల వరకు అనుమతి ఇస్తామన్నారు. అయితే పరీక్ష మాత్రం 12.45 గంటలకు మించి ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వలేమని స్పష్టం చేశారు. 165 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష డ్యూటీలు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఒక వేళ డ్యూటీలకు రాలేకపోతే జూన్ 12 వరకు మెడికల్ లీవ్ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని చెప్పారు. ఆ కేంద్రాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 10 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 30 సిటింగ్ స్క్వాడ్‌లతో నిత్యం నిఘా ఉంటుందని చెప్పారు. మాస్ కాపీయింగ్‌కు ఏ మాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ 7842641323 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


