ఆందోళనలతో.. అట్టుడికిన ఆర్డీఓ కార్యాలయం
బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన యువత నడిరోడ్డుపై బైఠాయించిన భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి రోడ్డుపై కూర్చున్న నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు పోలీసుల దుశ్చర్యలను సంఘటితంగా అడ్డుకున్న విద్యార్థులు, యువత డీఎస్పీ అనుమతితో ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించిన నేతలు
తిరుపతి రూరల్: ‘‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థి సంఘాలను నిర్వీర్యం చేయడంతో పాటు విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసింది.. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా చేతులెత్తేసింది.. ప్రశ్నించే గొంతులను నులిమేసేందుకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు పెట్టడం, రౌడీషీటర్లుగా ముద్ర వేయడం చేస్తోంది’ అని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యార్థి, యువజన సంఘాలు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడంతో వారి నినాదాలతో ఆ కార్యాలయం అట్టుడికింది.
తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ఐక్యవేదిక తరపున భారీ ధర్నాను శుక్రవారం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ధర్నా నిర్వహించనున్నట్టు ప్రతిపక్ష పార్టీల విద్యార్థి సంఘాల ప్రతినిధులు ముందుగానే బహిరంగ ప్రకటన విడుదల చేసినప్పటికీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆర్డీఓ కార్యాలయం ముందు విద్యార్థి, యువజన విభాగం నేతలు బైఠాయించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ, పీడీఎస్‌యూ, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలతో కలసి వైఎస్సార్ సీపీ తిరుపతి నియోజకవర్గం సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి నడిరోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం ముందు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడే ఉన్న పోలీసులు నడిరోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న నేతలు అందరినీ పక్కకు తరలించే ప్రయత్నం చేయగా తోపులాట, తొక్కిసలాట చోటు చేసుకుంది.
పోలీసుల దుశ్చర్యలతో రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. విద్యార్థి, యువజన విభాగం నాయకులకు అండగా మహిళలు ఎదురొడ్డి నిలబడడంతో పోలీసులు ఏమీ చేయలేక కొంత సమయం అలాగే వదిలేయాల్సి వచ్చింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయం లోపలికి అనుమతించడంతో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్‌ను కలసి వినతి పత్రం అందజేశారు.
ఆర్డీఓ కార్యాలయం చుట్టూ
పోలీసుల భద్రత
తిరుపతి ఆర్డీఓ కార్యాలయం చుట్టు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ రామయ్య, ఇతర సిబ్బంది పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాలు, యువత పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు రావడంతో వారిని కట్టడి చేయడానికి అష్టకష్టాలు పడ్డారు. అయితే వైఎస్సార్ సీపీ మద్దతుదారులు అధికంగా రావడంతో జీర్ణించుకోలేని పోలీసులు ఒక్కసారిగా నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేయగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సీఎం.. డౌన్.. డౌన్.., కూటమి పోవాలి.. జగన్ రావాలి.. విద్యార్థి సంఘాల ఐక్యత వర్థిల్లాలి.. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం.. విద్యార్థుల సమస్యలను వెంటనే.. పరిష్కరించాలి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి..అన్న నినాదాలతో రెండు గంటలపాటు హోరెత్తించారు. పోలీసులు ఊహించని విధంగా విద్యార్థులు, యువత తరలిరావడంతో ఆ ప్రాంతం మొత్తం జనసంద్రమైంది.
ఆందోళనలతో.. అట్టుడికిన ఆర్డీఓ కార్యాలయం
ఆందోళనలతో.. అట్టుడికిన ఆర్డీఓ కార్యాలయం


