గట్టెక్కని గ్రేటర్
గ్రేటర్ తిరుపతి గట్టెక్కలేదు. ప్రణాళికలు, తీర్మానాలకే పరిమితం అయ్యింది. ఇప్పట్లో లేదని సర్కారు వాయిదా ప్రకటన చేసింది. ఇందుకు జనగణన బూచిగా చూపింది. గతంలోనూ టీడీపీ ఇలానే హడావుడి చేసింది. గ్రేటర్ తిరుపతి రూపకల్పనలో టీడీపీకి చిత్తశుద్ధి లోపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తిరుపతి తుడా: అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పుకోవడంలో చంద్రబాబుకు మించిన రాజకీయ నేత మరొకరు ఉండరన్నది నానుడి. ప్రభుత్వ పెద్దలతో సంబంధం లేకుండా ఆ పార్టీ మంత్రులు సైతం నోటికి వచ్చిన హామీలు ఇవ్వడం సర్వసాధారణం. ఈ క్రమంలో తిరుపతిని అత్యవసరంగా గ్రేటర్‌గా విస్తరించనున్నట్లు ఆర్భాటంగా ఆరు నెలల క్రితం ప్రకటించారు. సీఎం స్వయంగా తిరుపతిపై ఫోకస్ పెట్టారని, తిరుపతిని మహానగరంగా విస్తరించి అమాంతంగా అభివృద్ధి చేస్తామంటూ ఆ పార్టీ నాయకులు హడావుడి చేశారు. 2017లోనూ ఇదే తరహా గ్రేటర్ తిరుపతిపై మాయ మాటలతో బురిడీ కొట్టించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తర్వాత గ్రేటర్ తిరుపతిపై హడావుడి సృష్టించి ఆపై తస్సుమనిపించారు. గ్రేటర్‌గా విస్తరించే ప్రతిపాదన ఇక ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. ఏదో చేసేస్తున్నారన్న భ్రమను ప్రజల్లో కల్పించేందుకు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు మరోసారి గ్రేటర్ తిరుపతిపై హడావుడి చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రతిపాదన వాయిదా వేస్తున్నట్లు ప్రకటన
గ్రేటర్ తిరుపతి కోసం మున్సిపల్ కార్పొరేషన్ సరైన కసరత్తు లేకుండా, అశాసీ్త్రయంగా కొన్ని పంచాయతీలను విలీనం చేస్తున్నట్లు కౌన్సిల్ ముందు పెట్టారు. ఈ ప్రతిపాదిత పంచాయతీలపై విమర్శలు వెల్లువెత్తడంతో మరోసారి అదే తరహా ప్రతిపాదనను సిద్ధం చేశారు. రెండోసారి కౌన్సిల్‌లో చర్చించి గ్రేటర్‌కు ఆమోదం తెలిపారు. అయితే 10 లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రతిపాదనే తిరుపతి భవిష్యత్తును మారుస్తుందని, తద్వారా కేంద్రం నుంచి నిధులు రెట్టింపు స్థాయిలో తెచ్చుకోవచ్చన్న ఎంపీ మద్దెల గురుమూర్తి చేసిన ప్రతిపాదన కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. గ్రేటర్‌లో విలీనం చేసే విధివిధానాలపై లోతైన కసరత్తు చేయాలని, కార్పొరేషన్ అధికారులు హడావుడిగా పేపర్ వర్క్ చేసి, చేతులు దులుపుకున్నట్లు పై ప్రతిపాదన ద్వారా తెలుస్తోందని ఆయన కౌన్సిల్ వేదికగా విమర్శించారు. రెండుసార్లు గ్రేటర్ తిరుపతిపై కౌన్సిల్ ఆమోదం పొంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. అయితే మంత్రి నారాయణ ప్రస్తుతానికి గ్రేటర్ తిరుపతిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. 2017 లోనూ తిరుపతిని గ్రేటర్‌గా మారుస్తున్నట్లు హడావుడి సృష్టించారు. ఏడాది కాలం పాటు అదిగో గ్రేటర్.. ఇదిగో గ్రేటర్ అంటూ ప్రజల్ని మాయలో పడేశారు. ఇప్పుడు మరోసారి గ్రేటర్ ప్రతిపాదనతో కొంతకాలం హడావుడి సృష్టించి తుస్సు మనిపించారు.
విస్తీర్ణం:
300
చరపు కిలోమీటర్లు
జన గణన బూచిగా చూపిన మంత్రి
ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేపడుతోందని, ఈ క్రమంలో గ్రేటర్ తిరుపతి సాధ్యం కాదంటూ 12 రోజుల క్రితం మంత్రి నారాయణ ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకొని గ్రేటర్‌ను చేపడితే రోజుల్లో గెజిట్ ఇచ్చి ఆమోదం తెలపవచ్చు. 2008లో కేవలం మూడు నెలల వ్యవధిలోనే మున్సిపాలిటీగా ఉన్న తిరుపతిని మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆమోద ముద్ర వేయించిన ఘనత నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. అలాగే కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడితే ఆ నెలలోనే ఏదైనా చేయొచ్చని నిరూపించింది.


