రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం శూన్యం
రెండు సంవత్సరాల్లో
రూ. 2 లక్షల కోట్లు అప్పులు
ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చని చంద్రబాబు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి మంగళం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో అభివృద్ధి, సంక్షేమం శూన్యమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మారుతీనగర్‌లోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువే సంక్షేమ పథకాలు అందిస్తానని మాయమాటలు చెప్పి అపద్ధపు హామీలు గుప్పించి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన ప్రజాద్రోహి చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ. 2లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఏ సంక్షేమ పథకాలు అందించారని, ఏ ప్రాజెక్టులు నిర్మించారని ప్రశ్నించారు. కేవలం దోచుకోవడం, దాచుకోవడం తప్ప చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోరన్నారు. లండన్‌కు వెళుతున్నానంటూ సింగపూర్‌కు వెళ్లి తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క సంక్షేమ పథకానైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రంతా మాయమాటలు చెప్పి మోసగించడం తప్ప ఒక మంచి పని చేసిన దాఖాలాలే లేవన్నారు. ఐదేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉంటేనే మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే చంద్రబాబుతోపాటు కూటమి నాయకుల లెక్కలు తేలుస్తామని, నిజానిజాలు బయటకు తీస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలనే టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించి, జైళ్లకు పంపుతుందని మండిపడ్డారు. చంద్రబాబు నిర్బంధాలకు ఎవరూ బయపడకుండా ధీటుగా ఎదుర్కొందామని సూచించారు. నూతన సంవత్సరంలో మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీ అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.


