ప్రజారంజకంగా ఫ్లెమింగో ఫెస్టివల్–26
సూళ్లూరుపేట: జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్–2026 సందర్భంగా అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేసి, పండుగను ప్రజారంజకంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ ఆదేశించారు. సూళ్లూరుపేట టీవీఆర్‌ఆర్ కళ్యాణమండపంలో బుధవారం ఫ్లెమింగో ఫెస్టివల్–2026 నిర్వహణకు సంబంధించి కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, జూ క్యూరేటర్ సెల్వం, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు, కిరణ్మయి, భానుప్రకాష్‌రెడ్డి, పర్యాటకశాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రమణ ప్రసాద్, డీఎస్పీ చెంచుబాబుతో కలిసి కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించబోయే ఫ్లెమింగో ఫెస్టివల్ విన్నూత్నంగా అందరినీ ఆకర్షించేలా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ పండుగ నిర్వహణకు శాఖలవారీగా కమిటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. గత ఏడాది మూడు రోజుల పాటు పండుగను నిర్వహించామని ఈ ఏడాది రెండు రోజులకే కుదించామని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని సూళ్లూరుపేట, నేలపట్టు, భీములవారిపాళెం, ఇరకం దీవి, సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని శ్రీసిటీ, ఉబ్బలమడుగు జలపాతం తదితర ప్రాంతాల్లో పండుగను నిర్వహించబోతున్నామని తెలిపారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముఖ్య వేదికగా పలు శాఖలు వివిధ రకాలైన ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేస్తాయని, నేలపట్టులో పక్షులు సందర్శన, భీములవారిపాళెంలో అడ్వంచర్ ఈవెంట్స్, ఏరో స్పోర్ట్స్, హార్ట్ ఎయిర్ బెలూన్స్, ఇరకందీవిలో పడవ షికార్, శ్రీసిటీలో ఏర్పాటు చేసిన బహుళజాతి కంపెనీల సందర్శన, ఉబ్బలమడుగు జలపాతం సందర్శన ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా సోషల్‌మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ మన నియోజకర్గంలో జరుగుతున్న పండుగ అయినందున మనది అనుకుని అందరూ సహకరించి ఎలాంటి విభేదాలు లేకుండా పండుగ నిర్వహణకు సహకరించాలని కోరారు.


