కాలువ కాజేసి..!
కళ్లకు గంతలు కట్టేసి..
అధికార పార్టీ అనధికార లేఅవుట్
వారు అధికారపార్టీ చోటా నేతలు.. ఆ రాజకీయ పలుకుబడితో పక్క మండల వీఆర్వోను వాటాదారుడిగా కలుపుకుని అతనికి ఎర వేశారు.. పంట కాలువపై పడగ చాపారు. కాలువ పక్కనే తమ అనధికార లేఅవుట్ ఉండడంతో అందులో కలిపేసుకున్నారు.లే అవు ట్ నమూనాలు రెండుగా సిద్ధం చేసుకుని, మాయ చేస్తూ కాలువను కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. కబ్జా చేసిన కాలువ స్థలం విలువ అధమపక్షంలో రూ.కోటి అని అంచనా. అడ్డుకోవాల్సిన అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని అక్రమాన్ని అడ్డుకోలేక పోతున్నారు. మరి కళ్లకు గంతలు కట్టుకున్న రెవెన్యూకు ఏమి ముట్టిందో మరి.
యథేచ్ఛగా తిరుపతి–చైన్నె హైవేకి సమీపంలో వ్యవసాయ భూమిలో అనుమతులు లేకుండా అనధికార లేఅవుట్ వేస్తూ రూ.కోటి విలువచేసే కాలువను ఆక్రమిస్తున్నా అటు ఇరిగేషన్ అధికారులు గానీ, ఇటు రెవెన్యూ అధికారులు గానీ ఆ వైపునకు వెళ్లకపోవడంతో వారి పాత్ర కూడా ఉందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. గత పది రోజుల క్రితం కాలువ ఆక్రమణపై విమర్శలు రావడంతో రెవెన్యూ అధికారులు వెళ్లి సర్వే చేసి తూతూ మంత్రంగా రెండు అడుగుల వెడల్పుతో కాలువ తీసి వచ్చేశారు. ప్రస్తుతం ఆ కాలువని సైతం పూడ్చి వేసి శరవేగంగా పనులు చేస్తున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: రేణిగుంట మండలంలో రూ.కోటికి పైగా విలువ చేసే కాలువను అధికార పార్టీ నాయకులు, పక్క మండల వీఆర్వోతో కలసి అనధికార లేఅవుట్‌లో కలుపుకుని దర్జాగా లేఅవుట్ పనులు చేస్తున్నారు. అయినా మండల రెవెన్యూ అధికారులు తమకేమీ కనిపించలేదన్నట్లు కళ్లకు గంతలు కట్టుకుని, తిరుగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. రేణిగుంట మండలంలోని గాజులమండ్యం– జీపాళెం రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిని కొందరు అధికార పార్టీ నాయకులు, పక్క మండల వీఆర్వో కలసి కొనుక్కొని ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వ్యవసాయ భూమిలో అనధికార లేఅవుట్ వేసేందుకు చదును చేస్తూ పక్కనే ఉన్న సర్వే నంబర్ 1101లో ఉన్న సుమారు 60 సెంట్ల కాలువను కలుపుకునేశారు. కాలువను పూడ్చి లేఅవుట్‌లో అంతర్గత రహదారిగా చూపుతూ లేఅవుట్ నమూనా స్కెచ్‌ని సైతం సిద్ధం చేసి, విక్రయాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ఒక లేఅవుట్ నమూనాలో కాలువ స్థలంలో 60 అడుగుల రోడ్డుగా చూపెట్టారు. మరో లేఅవుట్ నమూనాలో కాలువగా చూపుతూ రెండు నమూనా స్కెచ్ లను తయారు చేసుకుని అవసరమైన చోట అవసరమైన రీతిలో స్కెచ్‌లను వాడుకుంటూ అధికారులు, కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారు.
పక్క మండల వీఆర్వో ప్రమేయం
వ్యవసాయ భూమిలో అనధికార లేఅవుట్ వేస్తూ కాలువను ఆక్రమణల్లో స్థానిక అధికార పార్టీ నాయకులతో కలిసి స్థానికంగా కాపురం అంటూ పక్క మండలంలో వీఆర్వో విధులు నిర్వహించే వ్యక్తి అందులో వాటాదారుడుగా ఉంటున్నాడని స్థానికులు అంటున్నారు.
అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారి కలిసి ఉండడంతో స్థానిక రెవెన్యూ అధికారుల సైతం వారికి సహకారం అందిస్తున్నారని, అందుకే అనధికార లేఅవుట్ వేస్తూ కాలువని పూడ్చేందుకు స్వర్ణముఖి నది నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఎవరు పట్టించుకోవటం లేదని పలువురు వాపోతున్నారు.
రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు
కొన్ని నెలలుగా రేణిగుంట తహసీల్దార్ అక్రమ కట్టడాలంటూ పేదలకు చెందిన అనేక ఇళ్లను నేల మట్టం చేశారు. రెండు రోజుల క్రితం రైతు నుంచి లీజుకు తీసుకుని హోటల్ నడుపుకునేందుకు సుమారు రూ.30 లక్షలతో నిర్మించుకున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు నిర్ధాక్షిణ్యంగా ప్రభుత్వ భూమి అంటూ తొలగించారు. కానీ అధికార పార్టీ నాయకులు రూ.కోట్ల విలువ చేసే కాలువను ఆక్రమిస్తున్నా తమకేమీ కనిపించలేదన్న రీతిలో వ్యవ హరించడంతో మండలంలో అధికార పార్టీ నాయ కులకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయమా? అన్న చర్చ సాగుతోంది.
కాలువ కాజేసి..!
కాలువ కాజేసి..!


