తిరుపతిలో స్మార్ట్‌రగడ
‘ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు అమర్చుతోంది. అవి సామాన్యులకు పెనుభారం. వాటిని పగులగొట్టేయండి.’ ఇదీ నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మాట. గద్దెనెక్కిన అనంతరం చల్లగా స్మార్ట్ మీటర్ల అమరిక.. జనం నాడు లోకేష్ చెప్పిన మాటలు మర్చిపోలేదు. మాకొద్దు స్మార్ట్ మీటర్లు.. పాతమీటర్లే ముద్దు అని.. గొడవ చేశారు. చేసేది లేక అధికారులు వెనుదిరిగారు.. ఈ ఘటన బుధవారం తిరుపతి మారుతీనగర్‌లో చోటు చేసుకుంది.
తిరుపతి అర్బన్: నగరంలో స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై మారుతీనగర్‌లో బుధవారం రగడ చోటుచేసుకుంది. ప్రైవేటు వ్యక్తులు ఆదానీ పేరు చెప్పి.. మా అనుమతి లేకుండా పాత మీటర్లు తొలగించి.. స్మార్ట్ మీటర్లు ఎలా బిగిస్తారంటూ తిరుపతిలోని మారుతీనగర్ వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ స్మార్ట్ మీటర్ల పెడితే వాటిని పగలగొట్టాలని ఆదేశాలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారే స్మార్ట్ మీటర్లు పెట్టించడం ఎంత వరకు న్యాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు వద్దు.. పాత మీటర్లు ముద్దు అంటూ బిగించేవారని అడ్డుకున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎలా వస్తారంటూ మండిపడ్డారు. అయితే వారు తాము ఎస్పీడీసీఎల్ వాళ్లమని చెప్పకొచ్చారు. ఈ క్రమంలో స్థానికులకు మీటర్లు బిగిస్తున్న వారికి పెద్ద ఎత్తున వాగ్వావాదం చోటుచేసుకుంది. ఎస్పీడీసీఎల్ అధికారులతో తాము మాట్లాడుకుంటామని, మీటర్లు అమర్చకుండా వెళ్లిపోవాలని అభ్యతరం చెప్పడంతో వాళ్లు మీటర్లు వెనుదిరిగి వెళ్లిపోయారు. ముందే కరెంట్ చార్జీలను భరించలేక నానా తిప్పులు పడుతున్నామని..స్మార్ట్ మీటర్లు అమర్చితే రీచార్జిబుల్ మీటర్లుగా మారుతాయని.. తాము రీచార్జి చేసుకోలేమని తేల్చిచెప్పేశారు.


