వ్యవసాయ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 45 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయడం జరిగిందని, ఈ డిసెంబర్ 31వ తేదీలోగా మరో 5 వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరుతో 50 వేల సర్వీసుల మార్కును చేరుకోవాలని జిల్లా స్థాయి విద్యుత్ అధికారులకు సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్‌ఎస్) పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రూఫ్ టాప్ సోలార్‌పై అవగాహన
సంస్థ పరిధిలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా రూఫ్ టాప్ సోలార్ సిస్టంపై వినియోగదారుల్లో అవగాహనను పెంపొందించాలని సీఎండీ సూచించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు మాత్రమే కాకుండా, ఇతర గృహ వినియోగదారులను కూడా సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ’కరెంటోళ్ళ జనబాట’ కార్యక్రమం జరిగిన తీరుపై అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కే.గురవయ్య, కే.రామమోహన్‌రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జే.రమణాదేవి, కె. ఆదిశేషయ్య, పీహెచ్ జానకీరామ్, ఎం.మురళీకుమార్, పి. సురేంద్రనాయుడు, జనరల్ మేనేజర్లు కృష్ణారెడ్డి, విజయన్, రామచంద్రరావు, చక్రపాణి, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, ఎస్‌ఈలు చంద్రశేఖరరావు, రాఘవేంద్రరావు, రమణ, ఇస్మాయిల్ అహ్మద్, శేషాద్రి శేఖర్, ప్రదీప్ కుమార్, సుధాకర్, సంపత్ కుమార్, సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


