
ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను!
ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికుల పరిస్థితి దయనీయం ప్రశ్నిస్తే వేధింపులు.. ఏజెన్సీల మాటే శాసనం ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కొత్తగా క్లియరెన్స్ పత్రాలు ఇవ్వాలని మెలిక అరకొర జీతాలు.. అర్ధాకలితో అవస్థలు బోరుమంటున్న కార్మికులు
రేణిగుంట : విమానాశ్రయం సమీపంలోని ప్రైవేట్ కార్పొరేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేల మంది కార్మికులు కార్పొరేట్ సంస్థ చేతుల్లో కీలుబొమ్మలుగా మారి విలవిలలాడుతున్నారు. చదువుకొని ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులు పరిశ్రమలు పెట్టే నిబంధనలను గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పుకుంటూ అగ్రిమెంట్లపై సంతకాలు చేసి ఉద్యోగాల్లో చేరుతున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న పరిశ్రమలు ఏజెన్సీలతో కుమ్మకై ్క తాము ఇచ్చిందే జీతం, పెట్టిందే భోజనం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ బాధలు పడలేక రెండు రోజుల క్రితం రెండు పరిశ్రమలోని సుమారు 1500 మంది పైగా రెండు విడుతలుగా పరిశ్రమ ముందు కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. వారికి రెండు రోజుల్లో సమస్యలను పరిష్కారం చూపుతామని నచ్చజెప్పారు. కానీ అక్కడే పరిశ్రమ వారి ఈగో హర్ట్ అయింది.. కార్మికులకు కొత్త నిబంధనలు పెట్టి వేధింపులు మొదలుపెట్టారు.
పోలీస్ క్లియరెన్స్ కావాలంటూ మెలిక
ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రస్తుతం నూతనంగా చేరుతున్నట్లు అప్లికేషన్ రాసి పోలీస్ క్లియరెనన్స్ , హెల్త్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు జత చేసి ఇవ్వాలంటూ పరిశ్రమల యాజమాన్యం మెలిక పెట్టింది. ఇప్పటికే పనిచేస్తున్నా మళ్లీ ఇవన్నీ ఎందుకని ప్రశ్నించిన కార్మికులను ఇలా ఇస్తే ఇవ్వండి లేదా మీ ఇష్టం అంటూ పరిశ్రమ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు.
ఏజెన్సీల శ్రమ దోపిడీ
బాగా చదువుకొని ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న యువతీ, యువకులు ఏజెన్సీల మత్తులో పడుతున్నారు. ఏజెన్సీల ద్వారా ప్రైవేట్ పరిశ్రమల్లో చేరుతున్న కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. 30 రోజులపాటు శ్రమించి జీతం నాటికి ఎంత వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియక కార్మికులు మదన పడుతున్నారు. పరిశ్రమ వారిని అడిగితే ఏజెన్సీని అడగమని ఏజెన్సీ వారిని అడిగితే పరిశ్రమ వారిని అడగమని చెబుతూ కాలయాపన చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. లేబర్ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఏజెన్సీల ద్వారా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. కార్మికుల సమస్యలపై సీఐటీయూ నాయకులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టర్ల నుంచి కార్మికులకు రక్షణ కల్పించండి అంటూ కరపత్రాలను ప్రచురించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.