
పోరాటయోధుడు గౌతు లచ్చన్న
తిరుపతి అర్బన్ : పోరాట యోధుడు గౌతు లచ్చన్నగా కలెక్టర్ వెంకటేశ్వర్ కీర్తించారు. శనివారం కలెక్టరేట్‌లో విప్లవ నాయకుడు ‘ డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పనిచేశారని కొనియాడారు. స్ఫూర్తిదాయక జీవితం, అందరికి ఆదర్శమని, వారి త్యాగాలను మరవకుండా తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల చంగయ్య, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోత్స్న, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి గురుస్వామి శెట్టి, కలెక్టరేట్ కార్యాలయ ఏవో రమేష్ బాబు, తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నాగరాజు, సంఘం నాయకులు కిరణ్, వెంకట మణిబాబు, మనుశేఖర్,మల్లికార్జున, రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో వేడుకలు
తిరుపతి క్రైం : నిస్వార్థ రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా నిర్వహించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గౌతు లచ్చన్న తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. నిజాయతీ పరుడైన రాజకీయ నాయకుడని అందుకే పలుమార్లు లోకసభకు ఎన్నికయ్యారన్నారు.

పోరాటయోధుడు గౌతు లచ్చన్న