చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
డక్కిలి: మండలంలోని దగ్గవోలు గ్రామానికి చెందిన బోనుబోయిన వెంకటసుబ్బయ్య (55) గురువారం పూటుగా మద్యం సేవించి మద్యం మత్తులో గడ్డి మందు సేవించాడు. బంధువులు గూడూరులోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శుక్రవారం ఉదయం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ శశిశంకర్ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఎన్‌ఎస్‌యూ డీఈ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ దూర విద్యాకేంద్రం ఆధ్వర్యంలో పలు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.రంగనాథన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సంస్కృతంలో ఆరు నెలల వ్యవధి సర్టిఫికెట్ కోర్సు, ఏడాది వ్యవధి డిప్లొమో, రెండు సంవత్సరాల వ్యవధి పాక్‌శాస్త్రి కోర్సులు ఉన్నాయని తెలియజేశారు. ఈ కోర్సులకు ఆసక్తిగల వారు వచ్చేనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9440626562 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన గాజులపల్లి శంకర్‌రావు, ధర్మపత్ని శ్రీదేవి రూ.లక్ష విరాళంగా అందించినట్లు ఆలయ ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. దాతకు మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాలు అందించినట్లు ఆయన తెలిపారు.
టమాట లారీ బోల్తా
నాయుడుపేట టౌన్ : పట్టణ పరిఽధిలోని గోమతి సర్కిల్ సమీపంలో జాతీయ రహదారిపై టమాట లోడ్డుతో వెళుతున్న మీనీ లారీ శుక్రవారం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లి నుంచి నెల్లూరుకు మినీ లారీలో టమాటాలు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యంలో నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ముందు వెళుతున్న వాహనాన్ని అదిగమించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కగా పొలాల్లోకి వెళ్లి లారీ బోల్తా పడింది. క్షతగాత్రులను శ్రీకాళహస్తికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
దళిత బాలికపై అత్యాచార యత్నం
నిందితుడిపై పోక్సో కేసు
రేణిగుంట: దళిత బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన కామాంధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు. రేణిగుంట మండలం, కరకంబాడికి చెందిన ప్రసన్నకుమార్(38) అదే ప్రాంతంలో ఓ హోటల్ వద్ద ఉన్న దళిత బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సోతోపాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు అర్బన్ సీఐ జయచంద్ర తెలిపారు.


