తిరునగరిలో..
తిరుపతి నగరంలో ‘భూ’చోళ్లు రెచ్చిపోతున్నారు. అధిర అండదండలతో కబ్జాకోరులు చెలరేగిపోతున్నారు. ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు. రిజిస్ట్రేషన్ భూములైనా సరే.. ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. అడ్డొచ్చిన వారిని చితకబాదుతున్నారు. దళితులు, అనామకులైతే పిడిగుద్దుల వర్షం కురిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
బరితెగిస్తున్న కూటమి నేతలు
● విచ్చలవిడిగా ఆక్రమణలు ● బస్టాండ్, ఫుట్‌పాత్ స్థలాలు స్వాధీనం ● ఫేక్ రికార్డులతో రిజిస్ట్రేషన్లు ● కన్నెత్తి చూడని అధికారులు
ఫుట్ పాత్‌నీ వదిలేది లేదు
ఆర్టీసీ బస్టాప్ కోసం కేటాయించిన స్థలంలో ప్రహరీ నిర్మాణం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆధ్యాత్మిక నగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. అక్రమార్కులకు అధికారులు తోడవ్వడంతో నగరంలో విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.
దొంగ రికార్డులు.. అక్రమ రిజిస్ట్రేషన్లు
తిరుపతి రూరల్ మండలం, దామినేడు సర్వే నం.181/5లో 20 సెంట్ల విలువైన స్థలం ఉంది. ఇది మల్లికార్జునరెడ్డి, ధనలక్ష్మి పేరున రిజిస్ట్రర్ భూమి. ప్రస్తుతం దీని విలువ రూ.5 కోట్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన ఓ నాయకుడు దొంగ రికార్డులను సృష్టించి బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ టీడీపీ నేత అనుచరులతో రాత్రి సమయంలో ఆ భూమిలోకి చొరబడి కంచెను తొలగించి ఆక్రమించుకున్నారు. భూ యజమానులు వచ్చి తమ స్థలం అని చెప్పినా వినిపించుకోకుండా దౌర్జన్యానికి దిగారు. క్రిమినల్ కేసు నమోదైనా ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలు లేవు. అదేవిధంగా బాధితులు మంత్రి లోకేష్‌ని కూడా ఆశ్రయించినట్లు సమాచారం. అయితే అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. తిరుపతి అర్బన్ మండలం, కొంకచెన్నాగుంట పరిధిలో రెండు సెంట్ల ప్రైవేటు స్థలంలోకి ఇదే టీడీపీ బ్యాచ్ చొరబడి ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. స్థల యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై దాడికి యత్నించినట్లు సమాచారం. బాధితులు అతి సామాన్యులు కావడంతో వారికి అడ్డే లేకుండా పోతోంది.
నాడు వివాదం..నేడు కబ్జాల పర్వం
తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి– ఎంఆర్‌పల్లి రహదారి మార్గంలో ఆర్టీసీ బస్టాప్ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోంది. పల్లెవెలుగు బస్సులు నిలిపేందుకు గతంలో రాయలచెరువు వద్ద స్థలం కేటాయించడంతో వివాదం తలెత్తింది. దాంతో నాడు బైరాగిపట్టెడ ఆర్చికి ఎదురుగా తుడా కొంత స్థలాన్ని కేటాయిచింది. అప్పట్లో అక్కడ తాత్కాలిక బస్టాప్ కూడా ఏర్పాటు చేశారు. అయితే నేడు టీడీపీకి చెందిన ఓ నాయకుడు దర్జాగా ఆక్రమించుకుని చుట్టూ ప్రహరీ నిర్మాణం మొదలు పెట్టాడు. పక్కనే కాలువ పోరంబోకు స్థలాన్ని సైతం ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ స్థలం విలువ ప్రస్తుతం రూ.7 కోట్లుపై మాటే.
భూమాఫియా
నగరంలో కూటమికి చెందిన ఓ ఐదుగురు నేతలు ముఠాగా ఏర్పడి ఆక్రమణల పరంపరకు తెరలేపుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు ముందుగా వారి అనుచరులను దింపేస్తారు. ఆపై అధికారాన్ని అడ్డంపెట్టుకుని దొంగ రికార్డులు సృష్టించి తమ పేరున రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. బాధితులెవరైనా అడ్డుతగిలితే వారిపై దౌర్జన్యం చేయడం రివాజుగా మారుతోంది.
అన్నమయ్య కూడలి వద్ద దూరదర్శన్ కేంద్రం ముందు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఫుట్‌పాత్ నిర్మించారు. ఆ ఫుట్ పాత్‌పై పబ్లిక్ టాయ్‌లెట్ కూడా ఉంది. ఆ పక్కనే ఉన్న పుట్‌పాత్‌ని టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఆక్రమించాడు. రేకులతో బంక్‌ను ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చాడు. అంతటితో ఆగని అక్రమార్కులు మరికొంత ఆక్రమించుకునేందుకు కాలువపై రేకులు కూడా ఏర్పాటు చేశారు. కళ్లముందే ఫుట్‌పాత్ ఆక్రమణకు గురైనా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇలా నగరం చుట్టుపక్కల యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరునగరిలో..
తిరునగరిలో..


