తిరుపతి మంగళం: పార్ల మెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధాన మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల పథకం (పీఎంఎఫ్‌ఎంఈ) అమలుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని గురువారం తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ పథకం అమలు స్థితి, లబ్ధిదారుల వివరాలు, మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన సూక్ష్మ ఆహార పరిశ్రమలకు తీసుకున్న చర్యలు ఏమిటి, అమలులో ఎదురైన సవాళ్లు, పరిష్కార చర్యలు, లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, శిక్షణ, మౌలిక సదుపాయాల వివరాలు, ఆహార ప్రాసెసింగ్ రంగవృద్ధికి రూపొందించిన భవిష్యత్ ప్రణాళికలు వివరాలు తెలపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల పోటీ శక్తిని పెంచడం, అసంఘటిత రంగాన్ని పటిష్టంగా మార్చి సంస్థీకృత రంగంగా అభివృద్ధి చేయడం, మహిళలు, ప్రాంతీయ వర్గాలు, ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ తెలిపారు. ఈ పథకం తిరుపతి నియోజకవర్గంలో అమలును వి వరిస్తూ మొత్తం 248 మంది లబ్ధిదారులున్నారని, అందుకుగాను రూ.8.09 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేశారని తెలిపారు. అలాగే 1,959 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 7.53 కోట్లు మూలధన సహాయం, ఐఐటీ తిరుపతిలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్‌కు రూ.2.60 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణలో భాగంగా 190 మంది లబ్ధిదారులకు ప్రత్యేకశిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 72,388 మంది స్వా మివారిని దర్శించుకోగా 26,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. కాగా సర్వదర్శనం టో కెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూ లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది.