‘పచ్చ’ అరాచకం పరిశీలన | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ అరాచకం పరిశీలన

Published Mon, May 27 2024 4:25 PM

‘పచ్చ

టీడీపీ నేతల విధ్వంస వైఖరిపై ప్రజల ఆందోళన

ఇటీవల సర్పంచ్‌ ఇల్లు కాల్చివేత, ఇప్పుడు ప్రభుత్వ భవనం కూల్చివేత

చంద్రగిరి : ప్రభుత్వ భూమిని అక్రమంగా కాజేయాలనే దురుద్దేశంతో టీడీపీ నేతలు ఓ భవనాన్ని ధ్వంసం చేసిన ఘటనపై రెవెన్యూ అధికారులు స్పందించారు. మండలంలోని శేషాపురంలో సర్వే నంబరు 100లోని ప్రభుత్వ స్థలంలో పాల సెంటర్‌ భవనం ఉండేది. ఈ స్థలాన్ని కబ్జా చేయాలనే కుట్రతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కేశవులు నాయుడు, ఆయన కుమారులు జేసీబీ సాయంతో పాల సెంటర్‌ భవనాన్ని కూల్చేశారు. దీనిపై సాక్షి దినపత్రికలో కందులవారిపల్లెలో ‘‘టీడీపీ నాయకుల అరాచకం’’ శీర్షికతో ఆదివారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్‌ మారుతి తన సిబ్బందితో కలసి పాల సెంటర్‌ భవనాన్ని పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా పాల సెంటర్‌ భవనంలో అంగన్‌ వాడీ కేంద్రం కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నామని స్థానికులు వెల్లడించారు. అయితే కేశవుల నాయుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించినట్లుగా స్థానికులు తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రూ.లక్షల విలువైన భూమిని ఆక్రమించుకునేందుకు భవనాన్ని కూల్చేశారంటూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

బిక్కు బిక్కుమంటూ..

టీడీపీ నాయకుల అరాచకాలపై మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నికల పోలింగ్‌ సమయంలో రామిరెడ్డిపల్లె సర్పంచ్‌ ఇంటిని టీడీపీ నాయకులు ధ్వంసం చేసిన ఘటనను మరువక ముందే ప్రభుత్వ భవనం కూల్చేయడంతో ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకుల ఆగడాలు మితిమీరడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా రెవెన్యూ, పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ మారుతి తెలిపారు. ఇప్పటికే భవనం కూల్చివేతపై ఐదుగురు అనుమానితులను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూమి కబ్జా చేయాలని చూస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ మేరకు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

‘పచ్చ’ అరాచకం పరిశీలన
1/1

‘పచ్చ’ అరాచకం పరిశీలన

Advertisement
 
Advertisement
 
Advertisement