● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు

Published Sat, May 25 2024 1:30 AM

● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల న

గూడూరు రూరల్‌: మగ బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే ఓ బాలింత మృతిచెందింది. ఈ ఘటన శుక్రవారం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. గూడూరు రూరల్‌ పరిధిలోని చవటపాళెంకు చెందిన వేముల హరిక్రిష్ణ, తిరుపతిలోని మంగళం గ్రామానికి చెందిన శ్రావణికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. శ్రావణి మళ్లీ గర్భం దాల్చడంతో ఉప్పొంగిపోయారు. కొడుకు పుడతాడని, కుమార్తెకు తోడుగా ఉంటాడని కలలుగన్నారు. ఆస్తిపాస్తులేమీ లేకపోయినా కూలిపనులు చేసుకుంటూ.. రెక్కలు ముక్కలు చేసుకుని ఆరోగ్యాన్ని చూపించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో భర్త హరిక్రిష్ణ బంధువులతో కలిసి శ్రావణిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆపై కూలిపనులు ఉండడంతో వెళ్లిపోయాడు. మధ్యాహ్నం శ్రావణికి పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతో డాక్టర్లు ఆపరేషన్‌ చేసి పురుడు పోశారు. పండంటి మగబిడ్డ జన్మించడంతో తల్లితోపాటు కుటుంబ సభ్యులు బంధువులకు ఫోన్లు చేసి సంతోషం పంచుకున్నారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఏమైందో ఏమోగానీ శ్రావణి అపస్మారక స్థితికి చేరిందని, వెంటనే నెల్లూరుకు తీసుకెళ్లాలని డాక్టర్లు సెలవిచ్చారు. ఇంతలో అంబులెన్స్‌ మాట్లాడి నెల్లూరుకు తీసుకెళ్లగా శ్రావణి మృతి చెంది గంటకుపైగా అయ్యిందని అక్కడి డాక్టర్లు నిర్ధారించారు. శ్రావణికి రెండో కాన్పు కావడంతో సిజేరియన్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని.. ఆమె ఆరోగ్యం విషమించినా డాక్టర్లు ఎందుకు చెప్పలేదని మృతురాలి కుటుంబ సభ్యులు డాక్టర్లు నిలదీశారు. కానీ వాళ్లెవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో శ్రావణి మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలింత మృతిపై వివరణ కోరేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌తోపాటు ఇతర వైద్యులను ‘సాక్షి’ సంప్రదించగా వారు అందుబాటులో లేరు.

Advertisement
 
Advertisement
 
Advertisement