
రావులవారిపాళెం గ్రామస్తులతో మాట్లాడుతున్న అధికారులు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి దామ్లా నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హారుకానున్న మొదటి, మూడో సెమిస్టర్ విద్యార్థులు ఈ నెల 25లోపు, ఐదో సెమిస్టర్ విద్యార్థులు 30వ తేదీలోపు వర్సిటీ నిర్ణయించిన పరీక్ష ఫీజును చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ఎస్వీయూ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు మంగళవారం నోటిఫికేషన్‌ను పంపించినట్టు తెలిపారు. సోమవారం ఎస్వీయూ అధికారులతో పాలకమండలి సభ్యులు సమావేశమై పరీక్షల నిర్వహణ విధివిధానాలపై చర్చించారు. దీంతో మూడు సెమిస్టర్లకు ఒకే దశ పరీక్షలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 21 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 67,198 మంది స్వామివారిని దర్శించుకోగా 22,452 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.19 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
వర్షాలపై అప్రమత్తం
చిల్లకూరు: వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలోని బకింగ్ హామ్ కెనాల్‌కు ఆవలి వైపున ఉన్న గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం రావులవారిపాళెం, పోసినవారిపాళెం గ్రామాల్లో పర్యటించారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బంకింగ్ హామ్ కెనాల్‌కు సముంద్రం నీరు ఎక్కువగా చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు. పర్యటించిన వారిలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ అంజిరెడ్డి, ఆర్‌ఐ రమ్యస్వాతి, వీఆర్‌ఓలు బాలాజీ, జగదీష్ ఉన్నారు.
చౌకదుకాణాల్లో
రాగులు తీసుకోండి
తిరుపతి అర్బన్: జిల్లాలోని రేషన్‌కార్డుదారులకు డిసెంబర్ 1వ తేదీ నుంచి మూడు కిలోల రాగులను బియ్యానికి బదులుగా తీసుకోవచ్చని జిల్లా పౌరసరఫరాల అధికారి రాజరఘువీర్ మంగళవారం తెలిపారు. రేషన్ కార్డులో ఒక వ్యక్తి మూడు కిలోల రాగులు తీసుకుంటే మిగిలిన రెండు కిలోలు బియ్యం తీసుకోవచ్చని చెప్పారు. కనీసం ఒక కిలో రాగులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మిగిలిన 4 కిలోల బియ్యాన్ని ఉచితంగా పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై రేషన్ డీలర్లతో వివాదాలకు దిగకుండా గుర్తించాలని ఆయన సూచించారు.

రాజారఘువీర్, జిల్లా పౌరసరఫరాల అధికారి