
కలెక్టరేట్‌లో 104 కొత్త వాహనాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భూమన, కలెక్టర్ తదితరులు
తిరుపతి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏడు కొత్త 104 వాహనాలను కలెక్టర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. గత అక్టోబర్ 21వ తేదీన ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జిల్లాలో 104 వాహనాలు 32 ఉండగా, మరో 7 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే వైద్యం అందుబాటులో ఉండేలా ప్రతి 2 వేల మందికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. గడప వద్దకే వైద్యం అందించేలా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా జిల్లాలోని 436 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను సచివాలయ పరిధిలో ఉండేలా చర్యలు చేపట్టారన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా ప్రభుత్వ సెలవులు మినహా నెలలో 26 రోజులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలు, అంగన్‌వాడీలను సందర్శించి పిల్లలకు వైద్యం అందిస్తాని తెలిపారు. వయోభారంతో ఇంటి వద్దే వైద్యం పొందుతున్న వారికి సేవలు అందిస్తారని వెల్లడించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీహరి, 104 జిల్లా కో–ఆర్టినేటర్ శేషశయనారెడ్డి, డాక్టర్ ఛత్రప్రకాష్, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
కొత్తగా ఏడు 104 వాహనాల ప్రారంభం