మాజీ ఎమ్మెల్యే బాగన్న ఇకలేరు.. 

Zaheerabad Ex MLA Chengal Baganna Passed Away - Sakshi

అనారోగ్యంతో జహీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే మృతి  

జహీరాబాద్‌: జహీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సి.బాగన్న (82) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మరణించారు. ఆయన 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి.నర్సింహారెడ్డిపై 35 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.  

రాజకీయ ముఖచిత్రం.. 
బాగన్న జహీరాబాద్‌ ఎంపీపీ అధ్యక్షుడిగా పని చేశారు. 1984 నుంచి 1989 వరకు ఎంపీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. జహీరాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట కాగా, 1994 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెసేతర పార్టీ తరఫున విజయం సాధించిన మొట్ట మొదటి వ్యక్తి బాగన్నే. 1999 ఎన్నికల్లో బాగన్న తిరిగి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. ఆయన స్థానంలో టీడీపీ జి.గుండప్పకు టికెట్‌ కేటాయించింది. 2004 ఎన్నికల్లో టీడీపీ తిరిగి బాగన్నకు టికెట్‌ కేటాయించింది.

అప్పుడు బాగన్న ఓటమిని చవిచూశారు. 2008లో బీజేపీలో చేరి 2009 ఎన్నికల్లో జహీరాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమిచెందారు. అనంతరం అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. బాగన్న మరణంతో జహీరాబాద్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం బాగన్న అంత్యక్రియలు జహీరాబాద్‌లో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. బాగన్నకు ఇద్దరు కుమారులు గోపాల్, రాజశేఖర్, ఇద్దరు కుమార్తెలు పద్మమ్మ, అనూశమ్మ ఉన్నారు.  

సీఎం సంతాపం..  
మాజీ ఎమ్మెల్యే సి.బాగన్న మృతిపై సీఎం కె.చంద్రశేఖరరావు త్రీవ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సేవ కోసం జీవితం అంకితం చేసిన చెంగల్‌ బాగన్న నేటి తరం నాయకులకు ఆదర్శ ప్రాయుడని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top