
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
తల్లి, మేనమామకు గాయాలు
సిద్దిపేట కమాన్: సోదరుడికి రాఖీ కట్టేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్న యువతికి అదే చివరి రోజు అయ్యింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందగా.. తల్లి, మేనమామకు గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనపై సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాలివి. చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన తాళ్లపల్లి పర్షరాములు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం గజ్వేల్ పట్టణంలో భార్య పల్లవి, కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. వీరి కూతురు తాళ్లపల్లి శృతి (24) ఎం ఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
పర్షరాములు భార్య పల్లవి సిద్దిపేటలోని తమ్ముడు నాగిళ్ల శ్రీనివాస్‌కు రాఖీ కట్టేందుకు.. కూతురు శృతితో కలిసి గజ్వేల్ నుంచి సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తన భార్య, అక్క పల్లవి, మేనకోడలు శృతితో కారులో అల్లీపూర్ గ్రామానికి వెళ్లి భార్యను అక్కడ దింపేశాడు. అనంతరం మహారాష్ట్ర నుంచి వచ్చిన సోద రుడు లింగంకు రాఖీ కట్టేందుకు శృతి.. తన తల్లి పల్లవి, మేనమామ శ్రీనివాస్‌తో కలిసి నంగునూర్ మండలం నర్మెటకు బయలుదేరింది.
ఈ క్రమంలో పట్టణ శివారు రాజీవ్ రహదారిపై శ్రీనివాస్ నడుపుతున్న కారు టైరు పంక్చర్ కావడంతో.. నెమ్మది గా రోడ్డు పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు.. వెనుకనుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనక సీట్లో కూర్చున్న శృతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. శృతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్. ఆయన సోదరి పల్లవికి స్వల్ప గాయాలవడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.