Workation Trend In Hyderabad: Work From Mountain Hills, Beach, Forest - Sakshi
Sakshi News home page

Workation Trend In Hyderabad: సిటీలో కొత్త ట్రెండ్‌.. ‘వర్కేషన్‌’ అంటే ఏంటో తెలుసా?

Published Thu, Sep 29 2022 2:52 PM

Workation Trend In Hyderabad: Work From Mountain Hills, Beach, Forest  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కొండాపూర్‌లో నివసించే కార్పొరేట్‌ ఉద్యోగి వర్థన్‌.. గత ఏడాదిగా గోవా, మధురై, కేరళలలో ప్రకృతి అందాలను సతీసమేతంగా ఆస్వాదిస్తున్నారు. కనీసం 15 నుంచి 20 రోజుల వ్యవధి ఉండే ట్రిప్‌ పూర్తయిన తర్వాత నగరానికి రావడం ఓ వారం పదిరోజులు గడపడం ఆ వెంటనే మరో టూర్‌.. దీనిని బట్టి ఆయనను మనం వర్క్‌కి బంక్‌ కొట్టే వెకేషన్‌ లవర్‌గా భావిస్తాం. కానీ ఆయన  ఆస్వాదిస్తోంది వర్కేషన్‌. పిక్నిక్‌లోనూ పనిచేసే విధానం. 

ట్రావెల్‌ కంపెనీ బుకింగ్‌ డాట్‌ కామ్‌ సర్వే ప్రకారం గత ఏడాదిలోనే 68 శాతం మంది భారతీయ ప్రయాణికులు రాబోయే సంవత్సరానికి తమ వర్కేషన్స్‌ను బుక్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పర్వత ప్రకృతి దృశ్యాలు బ్యాక్‌డ్రాప్‌గా వర్క్‌స్టేషన్‌ల పోస్ట్‌లు..బీచ్‌లకు ఆనుకుని ఉన్న గది ఇన్‌స్టా రీల్స్‌తో సోషల్‌ మీడియా పని–ప్రకృతి ప్రేమికుల వేదికగా మారింది. 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి వర్కేషన్‌ దాకా 
కోవిడ్‌ దెబ్బకు కార్పొరేట్‌ ఉద్యోగుల పనితీరు ఆన్‌లైన్‌ వర్క్, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, హైబ్రిడ్‌/రిమోట్‌ వర్కింగ్‌ సిస్టమ్‌...ఇలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు వర్కేషన్‌గా ఊపందుకుంది. ‘ఇంటి నుంచి కాకుండా ఇష్టమైన టూర్‌లో ఉంటూ వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తూనే అసైన్డ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడమనే వర్కింగ్‌ ట్రెండ్‌నే వర్కేషన్‌’గా పేర్కొంటున్నారు. ఈ వర్కేషన్‌ ప్రియుల్ని డిజిటల్‌ నోమాడ్స్‌గా పిలుస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, అన్‌ అకాడమీ తదితర కార్పొరేట్‌ సంస్థలు ‘నిరవధిక వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ప్రకటన తర్వాత ఈ ట్రెండ్‌ బాగా ఊపందుకుంది. 

వర్క్‌తో పాటే విందు, వినోదం 
‘మా రిసార్ట్స్‌లో 80 శాతం వరకూ వర్కేషన్‌కు అనువుగా మార్చాం. బెస్ట్‌ వైఫై నెట్‌ వర్క్, ఫుడ్‌ ప్రీ ఆర్డర్స్‌ పెద్దలు పని టైమ్‌లో పిల్లల కోసం హ్యాపీ హబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్‌ ఏర్పాటు చేశాం’ అంటూ క్లబ్‌ మహీంద్రా రిసార్ట్స్‌ ప్రతినిధి చెప్పారు. కరావొకే లాంటి సరదా సంగీతాల ఈవెంట్స్‌తో పాటు సర్ఫింగ్, కయాకింగ్, స్టాండప్‌ పాడ్లింగ్, స్కీయింగ్, స్పిన్నింగ్, స్కేటింగ్‌ వంటివి వర్క్‌తో పాటు ఎంజాయ్‌ చేస్తున్నారు. రిషికేశ్, ధర్మశాల, కేరళ, కూర్గ్, గోవా తదితర ప్రాంతాలు నగర వర్కేషన్‌ ప్రియుల ఎంపిక జాబితాలో టాప్‌లో ఉన్నాయని ట్రావెల్‌ ఆపరేటర్‌ మీర్‌ చెప్పారు. 

 నగరానికి చెందిన ఓ కంపెనీలో స్ట్రాటజీ హెడ్‌ గా పనిచేస్తున్న సూర్య తేజ  గత రెండేళ్లుగా వారణాసి నుంచి గోవా..మధురై వరకు 65,000 కి.మీ ప్రయాణించాడు, మరి అత్యవసర పరిస్థితుల్లో ఎలా? అంటే సమాధానంగా సూర్య ఏమంటారంటే ‘గత 2021 అక్టోబర్‌లో నేను కేరళలోని, అరూకుట్టిలోని ఓ రిసార్ట్స్‌లో కయాకింగ్‌ యాక్టివిటీలో బిజీగా ఉంటూనే ఆన్‌లైన్‌ మీటింగ్‌కు హాజరయ్యా. కయాకింగ్‌ లాంటి యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు నా వెంట వాటర్‌ప్రూఫ్‌ బ్యాగ్‌ తప్పనిసరిగా ఉంటుంది’ అంటూ చెప్పడం పనితో పిక్నిక్‌ని కలిపిన వైనానికి అద్దం పడుతుంది.  

ఇటీవల బాగా పాపులరయిన వాటిలో డే కేషన్స్, వర్కేషన్స్‌. వీటికి అనుగుణంగా మేం మా ట్రావెల్‌ ప్యాకేజ్‌లను  డిజైన్‌ చేస్తున్నాం. అడ్వంచర్‌ యాక్టివిటీస్, నేచర్‌ వాక్స్, ఇగ్లూ స్టేయింగ్, హార్స్‌ రైడింగ్, చెట్ల మీద విందు, ఎటివి బైక్స్, పెయింట్‌ బాల్‌... ఫ్యామిలీతో సహా వచ్చేవారికి అనుగుణంగా తీర్చిదిద్దాం. మా సభ్యుల్లో దక్షిణాది నుంచి 30 శాతం ఉంటే అందులో హైదరాబాద్‌ వాటా పెద్దదే.   
–ప్రతినిధి, క్లబ్‌ మహేంద్రా హాలిడేస్‌– రిసార్ట్స్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement